కరోనా: టిక్‌టాక్‌లో విపరీత చర్య.. అరెస్టు

4 Apr, 2020 16:07 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేసి ప్రజలను అప్రతమత్తం చేస్తుంటే.. కొందరు ఆకతాయిలు పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటే మరికొందరు విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. బయటకు వెళ్లేప్పుడు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో... ఓ వ్యక్తి ఏకంగా కరెన్సీ నోట్లతో ముక్కు చీదుకుంటూ వీడియో తీసుకున్నాడు. దానిని టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రజలను భయాందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.(కరోనా పాజిటివ్‌.. 10 లక్షల డాలర్ల విరాళం!)

వివరాలు.... నాసిక్‌కు చెందిన సయ్యద్‌ జమీల్‌ సయ్యద్‌ బాబు(38) ఇటీవల ఓ టిక్‌టాక్‌ వీడియో రూపొందించాడు. కరెన్సీ నోట్లతో తన నోరు, ముక్కు తుడుచుకున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం దేశంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా క్షణాల్లోనే వైరల్‌ అయింది. దీంతో రంగంలోకి దిగిన మాలేగావ్‌ పోలీసులు గురువారం సయ్యద్‌ బాబును అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 7దాకా అతడిని కస్టడీలో ఉంచేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే తబ్లిగీ జమాత్‌ ప్రకంపనలతో ఓ వర్గంపై సోషల్‌ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి తరుణంలో సయ్యద్‌ ఇలాంటి వీడియో రూపొందించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తించవద్దంటూ హితవు పలుకుతున్నారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటి వరకు 423 కరోనా కేసులు నమోదు కాగా... 19 మంది కోవిడ్‌-19 బారిన పడి మరణించారు. (ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌: మొయిలీ)

మరిన్ని వార్తలు