పెట్రోల్‌‌ ధరలపై బిగ్‌బీని ప్రశ్నించిన మంత్రి!

26 Jun, 2020 13:01 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్‌ ముంబైలో పెరుగుతున్న ఇంధన‌ ధరలపై సరదాగా స్పందించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను కార్లో ఇంధనం నింపాక బిల్లును తనిఖీ చేయడం లేదా అని శుక్రవారం ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజు రోజుకు పెంచుతుండటంతో బిగ్‌బీ గతంలో చేసిన ట్వీట్‌పై ఈ సందర్భంగా మంత్రి స్పందించారు. 2012లో పెట్రోల్‌ ధరలు మిన్నంటడంతో బిగ్‌బీ సరదాగా చేసిన ఓ ట్వీట్‌ను మంత్రి అవాద్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘పెట్రోల్‌ ధర లీటర్‌పై 7.5 రూపాయలు పెరగడంతో అసహనంతో ఉన్న ఓ ముంబైవాసి పెట్రోల్‌ పంప్‌‌కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది అతడిని ఎంత పెట్రోల్‌ కొట్టాలి సార్‌ అని అడగ్గా.. ఆ ముంబై వాసి 2-4 రూపాయల పెట్రోల్‌ను కారుపై కొట్టండి దాన్ని తగలబెట్టేస్తా’ అంటూ అగ్రహం వ్యక్తం చేసినట్లు బిగ్‌బీ సరదాగా  ట్వీట్‌ చేశాడు. 
(‘పెట్రో’ మంట; వైర‌ల‌వుతున్న బిగ్‌బీ ట్వీట్‌)

ప్రస్తుత పెట్రోల్‌ ధరలు కూడా పెరగడంతో మంత్రి అవాద్‌ ఆ ట్వీట్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘మీ కారులో  ఇంధనం నింపాక బిల్లు చూడటం లేదా?  ఇప్పుడు మీరు మాట్లాడే సమయం వచ్చింది. పక్షపాతం వహించకుండా మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరల చూస్తే కార్లు నడపాలా, లేదా కాల్చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ ఆయన రాసుకొచ్చారు. అదే విధంగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ 2011 మే 16న పెట్రోల్‌ ధరలు పెంచడానికి ముందు చేసిన ట్వీట్‌ను కూడా మంత్రి గురువారం షేర్‌ చేశారు. ‘‘ఈ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్తానో లేదో తెలియదు. పెట్రోల్‌ పంప్‌ ముందు క్యూ కడుతూ ప్రజలు ముంబై రోడ్లపైకి వచ్చారు’’ అంటూ చేసిన ట్వీట్‌కు మంత్రి ‘‘ఏంటీ మీరు ట్విటర్‌లో యాక్టివ్‌గా లేరా?, న్యూస్‌ పేపర్‌ ఫాలో అవడం లేదా, లేక కార్లను వాడటం మానేశారా?’’ అంటూ సరదాగా చమత్కరించారు. కాగా ముంబైలో ఇవాళ లీటరు పెట్రోల్‌ 86.91 రూపాయలు, లీటరు డీజిల్‌ 78.51 రూపాయలు ఉంది. (మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే)

మరిన్ని వార్తలు