ఇక బీఫ్‌తో వెళితే బుక్కే.. కిట్‌లు రెడీ

7 Jul, 2017 19:06 IST|Sakshi
ఇక బీఫ్‌తో వెళితే బుక్కే.. కిట్‌లు రెడీ

ముంబయి: మహారాష్ట్రలో బీఫ్‌ నియంత్రణకు పోలీసులు మరో అడుగు ముందుకేశారు. తమ రాష్ట్రంలో విజయవంతంగా బీఫ్‌ బ్యాన్‌ను అమలుచేసేందుకు, ఎవరైనా అక్రమంగా ఎద్దుమాంసం తరలిస్తుంటే గుర్తించి అరెస్టు చేసేందుకు టెక్నాలజీ సాయంతో ముందుకెళ్లనున్నారు. బీఫ్‌ను కనిపెట్టే ప్రత్యేక కిట్‌ల కోసం పోలీసులు ఆర్డర్‌ చేశారు. ఈ విషయాన్ని పోలీసులే నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా గోమాంసంపై పెద్ద మొత్తంలో రగడ ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో ముంబయి పోలీసులు ఈ విషయం బయటపెట్టడం మరింత ఉద్రిక్తతను నెలకొల్పే అవకాశం ఉంది.

ఎవరికి నచ్చింది వారు తింటారని, తినే ఆహారం విషయంలో ఎవరూ నియంత్రణలు పెట్టడానికి వీల్లేదంటూ దేశ వ్యాప్తంగా పలువురు సామాజిక వేత్తలు, ఇతర పార్టీల వారు బీఫ్‌ విషయంలో చెబుతుండగా బీజేపీ పాలిత రాష్ట్రంలో మాత్రం బీఫ్‌ బ్యాన్‌ను గట్టిగానే అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో పోలీసులు ఇలా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

‘45 బీఫ్‌ టిడెక్షన్‌ కిట్లకు ఆర్డర్లు ఇచ్చాం. వీటిని మొబైల్‌ వ్యాన్‌లలో ఉంచుతాం. వాటి ద్వారా ఆయా దుఖాణాల్లో విక్రయిస్తున్న మాంసాన్నిగాని, ఎవరైనా దొంగచాటుగా తరలిస్తున్న మాంసాన్నిగానీ ఈ కిట్ల సహాయంతో టెస్ట్‌ చేస్తాం. అందులో బీఫ్‌ ప్రొటీన్స్‌ గుర్తించడం ద్వారా అరగంటలో అది ఎద్దుమాంసమో కాదో తేలుస్తాం’ అని పోలీసులు చెప్పారు. ఇది గర్భ నిర్ధారణ పరీక్ష కిట్‌ మాదిరిగానే ఉండనుందట. దీని ఆధారంగానే ఇకపై కేసులు నమోదు చేస్తామంటూ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు