మహా @ 30,000

18 May, 2020 05:34 IST|Sakshi

దేశంలో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే..

సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ముంబైతోపాటు మహారాష్ట్రలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. మార్చి 9వ తేదీన దుబాయ్‌ నుంచి పుణేకు వచ్చిన దంపతుల ద్వారా మహారాష్ట్రలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ రోజురోజుకూ తన విశ్వరూపం చూపిస్తోంది.  మహారాష్ట్రలో గడిచిన ఎనిమిది రోజులను పరిశీలిస్తే ఒకటీ రెండూ కాదు ఏకంగా 10 వేల మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇలా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 30 వేలను దాటింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన అనంతరం 16వ రోజు నాటికి 100గా ఉన్న కరోనా బాధితుల సంఖ్య మరో 15 రోజుల్లో అంటే నెల రోజులు తిరగకుండానే 1,000కి చేరింది. 54 రోజుల్లో 10 వేల సంఖ్యను దాటింది. మొదటి 10 వేల కరోనా కేసులు నమోదు కావడానికి 54 రోజులు కాగా అనంతరం మరో 10 రోజుల్లోనే ఈ సంఖ్య 10 వేలు పెరిగింది. ఇలా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 20 వేలను దాటింది. ఆతర్వాత ఈ సంఖ్య 30 వేలకు చేరడానికి కేవలం 8 రోజులే పట్టింది.

1,000 దాటిన మృతులు...
రాష్ట్రంలో కరోనా ప్రవేశించిన వారం రోజుల్లోనే మార్చి 17వ తేదీన కరోనాతో ఓ వృద్ధుడు చనిపోయారు. అనంతరం నెల రోజుల్లోనే మృతుల సంఖ్య 50 దాటింది.  మే 5వ తేదీ నాటికి 500ను దాటింది.  ఈ నెల 16వ తేదీ వరకు 1,068 మంది కరోనా వైరస్‌తో చనిపోయారు.

సగానికి మించి ముంబైలోనే..: మహా రాష్ట్రలో బయట పడిన కరోనా కేసుల్లో సగానికి పైగా దేశ ఆర్థికరాజధాని ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే సుమారు 4వ వంతు కేసులు ఒక్క ముంబైలోనే బయటపడు తున్నాయి.  ముంబైలో కరోనా బాధితుల సంఖ్య 20 వేలకు చేరువైంది. కొన్ని రోజులుగా సగటున ప్రతి రోజున ఏడు నుంచి ఎనిమిది వందలు పెరుగుతూ మే 16వ తేదీ నాటికి కరోనా బాధితుల సంఖ్య 18,555కు చేరింది. ముంబైలో మే 16వ తేదీ వరకు 696 మందిని కరోనా బలిగొంది.
సొంతూళ్లకు వెళ్లేందుకు నవీ ముంబై రైల్వే స్టేషన్‌ వద్ద యూపీ వలస కార్మికుల క్యూ

మరిన్ని వార్తలు