ఊటీ, మనాలిని మరపించే ప్రకృతి అందాలు!

17 Oct, 2019 11:23 IST|Sakshi

పర్యాటకులను ఆకర్షిస్తున్న సండూరు అందాలు

సాక్షి, బెంగళూరు : ఊటీ, కులు మనాలీని మరిపించే ప్రకృతి అందచందాలను తిలకించాలంటే మనం అక్కడికే వెళ్లవలసిన అవసరం లేదు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో గల సండూరుకు ప్రయాణమైతే చాలు. పచ్చని కొండలు కోనలు, లోయలు, జలజలపారే సెలయేళ్లు, ఎర్రని మట్టి రోడ్లు, ప్రాచీన ఆలయాలు ఇంకా ఎన్నెన్నో ప్రకృతి అందాలు. అక్కడ ఒక్కో ప్రాంతం చూస్తుంటే మనం ప్రపంచాన్నే మరిచి పోతాం. 1943లో జాతిపిత మహాత్మాగాంధీ సండూరు ప్రకృతిని తిలకించి పులకించిపోయి ‘సీ సండూర్‌ ఇన్‌ సెప్టెంబర్‌’ అని పిలుపునిచ్చారు. ఇక ఈ ఏడాది వరుణుడు కరుణించడంతో ప్రకృతి పులకరించి పుష్కలంగా వర్షాలు కురవడం వల్ల ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. రెప్ప వేయడం కూడా కష్టమే అంటే అతిశయోక్తి కాదు. గనులకు మారుపేరైన సండూరు ప్రకృతి సోయగాలతో పర్యాటకుల మనసులు దోచుకుంటోంది.

ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో కుమారస్వామి, పార్వతీదేవి, గండి నరసింహ ఆలయాలు పర్యాటకుల మనసును ప్రశాంతంగా మార్చి వేస్తాయనడంలో సందేహం లేదు.  ఎటు చూసినా ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, చుట్టూ వృక్షాలు తెల్లవారు జామున మంచుకు మరింత సోయగం అందిస్తాయి. ఇక్కడ సూర్యకిరణాల దర్శనం కూడా కరువే అని చెప్పవచ్చు. ప్రత్యేకించి నందిహళ్లి, వర్సిటీ, కుమారస్వామి ఆలయం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తాయి. అంతేకాదు ఇలాంటి ప్రకృతి ప్రాంతంలో రెండు కొండల నడుమ ఎప్పుడో తొలిచిన గుహ ద్వారా రైళ్ల రాకపోకల శబ్ధాలు, సెలయేళ్ల పరవళ్లు మనం ఎక్కడ ఉన్నాం? అనిపిస్తాయి. ప్రత్యేకించి దారి వంక చెరువు, ఇరుకొండల నడుమ పారుతున్న సెలయేళ్ల దృశ్యాలు మనసును దోచుకుంటాయి. ఆగస్టు, సెపె్టంబర్‌ నెలల్లో కురిసే వర్షాలకు ఇక్కడి ప్రకృతి పులకించి వివిధ రకాల పక్షుల కూతలతో మనసును దోచుకుంటాయి. వర్షాలు తగ్గి అక్టోబర్‌లో మరింత నెమ్మదిగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

 

హంపీకి 40 కిలోమీటర్లే  
ఇంతటి అందమైన ప్రాంతం మనకు సమీపంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కేవలం హంపీ పర్యాటక కేంద్రం ఒక్కటే జిల్లాలో ఉందనుకొని హంపీని సందర్శించి వెళ్లిపోతారే తప్ప హంపీకి కేవలం 40 కిలోమీటర్ల దూరాన సండూరు గురించి తెలిసినవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారు సండూరు అందాలను వర్ణించిన తర్వాత ఇక్కడ పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఇక బళ్లారి, హొసపేటె పట్టణాల నుంచి సండూరుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకృతి అందాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసిన పక్షంలో పర్యాటకులు ఊటీ తదితర ప్రాంతాలకు బదులుగా సండూరు ప్రకృతి సోయగాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతారనడంలో అతిశయోక్తి లేదు. బళ్లారి, హొస్పేటల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. 

మరిన్ని వార్తలు