నెటిజన్ల ఆగ్రహం.. స్పందించిన కొటక్‌ మహీంద్రా

14 Apr, 2018 09:27 IST|Sakshi
కథువా హత్యాచార బాధిత బాలిక.. పక్కనే కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌(ప్రతీకాత్మక చిత్రం)

తిరువనంతపురం : సోషల్‌ మీడియాలో తమ బ్యాంక్‌ ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తటంతో కొటక్‌ మహీంద్రా స్పందించింది. ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కొచ్చిలోని పలారివట్టోమ్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ విష్ణు నందకుమార్‌ ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళయాళంలో ఓ పోస్ట్‌ చేశాడు. అందులో కథువా హత్యాచార ఘటనపై స్పందించిన విష్ణు.. ‘చిన్నారిపై జరిగిన ఘాతుకం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పడు ఆమె చావటం సరైందే. లేకపోతే భవిష్యత్‌లో మానవ బాంబుగా మారి వందల మందిని బలితీసుకునేదేమో’  అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

దీనిపై సోషల్‌ మీడియాలో ఆగ్రహజ్వాలలు వ్యక్తం అయ్యాయి.  విష్ణును బండబూతులు తిడుతూ పలువురు పోస్టులు చేశారు. పనిలో పనిగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు కూడా కొందరు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని.. లేకపోతే బ్యాంకులపై దాడులు చేస్తామని పేర్కొ‍న్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్యాంక్‌ యాజమాన్యం.. ‘ఏప్రిల్‌ 11న విష్ణు నందకుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించేశాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదు’ అని పేర్కొంది. అయితే పనిలో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించని కారణంగానే అతన్ని తొలగించినట్లు ఆ ప్రకటన పేర్కొనటం గమనార్హం.

విష్ణు నందకుమార్‌.. పక్కనే అతను చేసిన పోస్ట్‌

మరిన్ని వార్తలు