అతడితోనా..లేదే!

16 Sep, 2014 22:21 IST|Sakshi
అతడితోనా..లేదే!

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో హీరో రణవీర్‌సింగ్‌తో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని పాకిస్థానీ నటి మహిరా ఖాన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ హిట్ సీరియల్ ‘హమ్‌సఫర్’లో ఆమె కీలకపాత్ర పోషించింది. అతి త్వరలో ఆ సీరియల్ భారత దేశ బుల్లితెర అభిమానులను రంజింపజేయనుంది.

 

ఈ సందర్భంగా ఆమె మీడియాతో పాకిస్థాన్‌కు చెందిన కరాచీ నగరం నుంచి మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తన అరంగేంట్రం రణవీర్ సింగ్‌తో ఉంటుందన్న వార్తలను కొట్టిపారేసింది. తనకు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్న మాట వాస్తవమే అయినా ఇప్పటివరకు ఏ హిందీ సినిమానూ తాను అంగీకరించలేదని చెప్పింది.

‘అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడ పుడతాయో అర్థం కావడంలేదు.. పేపర్లలోనే కాక ఆన్‌లైన్‌లోనూ వస్తున్న ఇటువంటి పుకార్లను చూసి చాలా బాధపడుతున్నా.. నాకు బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చినా వాటిలో నా మనసును తాకిన కథ ఒక్కటి కూడా లేదు.. అందుకే ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాకూ సంతకం పెట్టలేదు..’ అని నొక్కిచెప్పింది. కాగా, భారత్ సినిమాల్లో అరంగేంట్రం చేసేందుకు ‘హమ్‌సఫర్’లో తనతోపాటు నటించిన ఫవద్ ఖాన్ సహాయసహకారాలు తీసుకుంటానని ఆమె చెప్పింది.

 తనకు భారత్‌లో పనిచేయాలని ఉందని, అయితే దానికి తగిన పాత్ర లభించాల్సి ఉందని తెలిపింది.‘ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన ‘ఖూబ్‌సూరత్’ సినిమాలో నటించిన ఫవద్ ఖాన్ నటనకు బాగానే మార్కులు పడ్డాయి. అతడికి భారతదేశంలో అభిమానులు పెరిగారు.. అతడిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది.. భారత్ సినిమా రంగంలో ఎలా మసలుకోవాలో ఫవద్ చాలా బాగా వంటబట్టించుకున్నాడు..  ఇంతకు ముందు పాకిస్థాన్‌లో ఎప్పుడూ ఇలా ఇంటర్వ్యూలకు అతడు హాజరయినట్లు నాకు గుర్తులేదు.. భారత్‌లో మాత్రం ఒకేరోజు చాలా ఇంటర్వ్యూల్లో కనిపించాడు.. ’ అని మహిరా పేర్కొంది.

మరిన్ని వార్తలు