ఎఫ్‌ఐఆర్‌లో మేజర్‌ ఆదిత్య పేరు చేర్చలేదు

6 Mar, 2018 03:02 IST|Sakshi

షోపియాన్‌ కాల్పుల కేసులో సుప్రీంకోర్టుకు తెలిపిన జమ్మూ ప్రభుత్వం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో జనవరి 27న జరిగిన షోపియాన్‌ కాల్పుల కేసులో మేజర్‌ ఆదిత్య కుమార్‌కు ఊరట లభించింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య పేరును నిందితునిగా చేర్చలేదని సుప్రీంకోర్టుకు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఏప్రిల్‌ 24 వరకు కేసులో తదుపరి దర్యాప్తు నిలిపేయాలని ఆదేశించింది.

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జనవరి 27న భారత సైన్యంపై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సైన్యం కాల్పులు జరపగా.. ముగ్గురు పౌరులు మృతిచెందారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దర్యాప్తునకు ఆదేశించగా.. 10 గర్వాల్‌ రైఫిల్‌కు చెందిన ఆర్మీ అధికారులపై సెక్షన్‌ 302, 307 కింద కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో తన కొడుకు పేరును ఏకపక్షంగా నమోదు చేశారని, ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఆదిత్య తండ్రి లెఫ్టినెంట్‌ కల్నల్‌ (రిటైర్డ్‌) కరమ్‌వీర్‌ సింగ్‌ సుప్రీంను ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు