‘వలస కూలీలపై చార్జీల భారం మోపొద్దు’

28 May, 2020 16:33 IST|Sakshi

వలస కూలీలకు సుప్రీం బాసట 

సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీల సమస్యలపై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. వారిని క్షేమంగా స్వస్ధలాలకు చేర్చేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరింది. రైళ్లు, బస్సుల్లో వలస కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. వలస కూలీల సమస్యలను సమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు వలస కార్మికుల ప్రయాణ చార్జీల భారాన్ని రాష్ట్రాలు భరించాలని, కార్మికులందరికీ ఉచితంగా ఆహారం సరఫరా చేయాలని ఆదేశించింది. ఆహారం ఎక్కడ అందుబాటులో ఉందనే వివరాలను బహిరంగంగా వెల్లడించాలని కోరింది.

వలస కూలీలు ప్రయాణం ప్రారంభించే ప్రాంతంలో ఆయా రాష్ట్రాలు వారికి ఆహారం, నీరు అందచేయాలని స్పష్టం చేసింది. కూలీలు రైళ్లు, బస్సులు దిగిన తర్వాత సంబంధిత రాష్ట్రాలు వారు తమ గ్రామానికి వెళ్లేందుకు రవాణా సదుపాయం, ఆహారాన్ని సమకూర్చాలని కోర్టు పేర్కొంది. వలస కూలీల నమోదును వేగవంతం చేయాలని, మరిన్ని డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కోరింది. రోడ్లపై నడుస్తూ వెళుతున్న వలస కూలీలను సమీపంలోని క్యాంపులకు తీసుకువెళ్లి వారికి అన్ని సౌకర్యాలనూ కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారితో అసాధారణ సంక్షోభం తలెత్తిన క్రమంలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, వలస కూలీలను స్వస్ధలాలకు చేర్చేందుకు సమన్వయంతో ముందుకెళుతోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు వివరించారు.

చదవండి : రుణాలపై మారటోరియం: సుప్రీం నోటీసులు

మరిన్ని వార్తలు