12 కి.మీ వరకూ పేలుడు శబ్దం

15 Feb, 2019 04:55 IST|Sakshi

శ్రీనగర్‌: పుల్వామా జిల్లాలో గురువారం జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడితో స్థానికులు వణికిపోయారు. లెత్‌పొరా మార్కెట్‌కు 300 మీటర్ల దూరంలోనే ఈ దాడి చోటుచేసుకోవడంతో దుకాణదారులు షట్టర్లు మూసేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఆత్మాహుతి దాడి సందర్భంగా ఏర్పడ్డ పేలుడు శబ్దం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఉన్న శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం పేలుడు శబ్దం వినిపించదన్నారు.

పేలుడు తీవ్రతకు ఉగ్రవాది ఆదిల్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయని జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిని గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు. ఈ ఘటనలో జవాన్ల బస్సుతో పాటు స్కార్పియో వాహనం నామరూపాలు లేకుండా పోయాయన్నారు. 2001, అక్టోబర్‌ 1న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీపై జైషే ఉగ్రవాదులు చేసిన దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. తాజాగా ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 43 మంది జవాన్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.  

గతంలో కశ్మీర్‌లో ఉగ్రదాడులు
1999 నుంచి ఇప్పటివరకు భద్రతా దళాలపై జరిపిన ప్రధాన దాడులు..
► 2017 ఆగస్ట్‌ 26: పుల్వామా జిల్లా పోలీస్‌ లైన్స్‌పై ఉగ్రదాడి. ఎనిమిది మంది భద్రత సిబ్బంది మృతి.

► 2016 నవంబర్‌ 29: నాగ్రోటా వద్ద గల సైనిక ఆయుధాగారంపై దాడి. ఏడుగురు సైనికులు మరణించారు.  

► 2016 సెప్టెంబర్‌ 18: బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఆర్మీ శిబిరంపై నలుగురు పాక్‌ తీవ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ దాడి చేసింది.  

► 2016 జూన్‌ 25: శ్రీనగర్‌–జమ్మూ హైవేపై పాంపోర్‌ వద్ద సీఆర్పీఎఫ్‌ బస్సుపై ఉగ్రకాల్పులు. ఎనిమిది మంది జవాన్ల మృతి.  

► 2016 జూన్‌ 3: పాంపోర్‌లో సీఆర్పీఎఫ్‌ బస్సుపై ఉగ్రదాడి. దాడి తర్వాత ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు. రెండ్రోజులు కొనసాగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులంతా హతమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు.

► 2014 డిసెంబర్‌ 5: మొహ్రాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి. పది మంది సైనికులు ప్రాణాలు వదిలారు.  

► 2013 జూన్‌ 24: హైదర్పోరా వద్ద సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై దాడి. ఎనిమిది మంది సైనికుల మృతి.  

► 2008 జూలై 19: శ్రీనగర్‌–బారాముల్లా రహదారిపై నరబల్‌ వద్ద రోడ్డు పక్కన ఐఈడీ అమర్చి పేల్చడంతో పది మంది సైనికులు చనిపోయారు.

► 2005 నవంబర్‌ 2: నౌగమ్‌లో నాటి సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఇంటి దగ్గర్లో కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరుల మరణం.  

► 2005 జూలై 20: భద్రతా దళాల కాన్వాయ్‌పై కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరుల దుర్మరణం.

► 2005 జూన్‌ 24: శ్రీనగర్‌ శివార్లలో కారు బాంబును పేల్చిన ఉగ్రవాదులు. తొమ్మిది మంది సైనికుల మృతి.   

► 2004 ఏప్రిల్‌ 8: బారాముల్లా జిల్లాలోని ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై గ్రెనేడ్‌లతో దాడి. 11 మంది చనిపోయారు.

► 2003 జులై 22: అక్నూర్‌లో సైనిక శిబిరంపై దాడి. బ్రిగేడియర్‌సహా ఎనిమిది మంది సైనికుల మరణం.  

► 2003 జూన్‌ 28: సన్జాన్‌ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి. 12 మంది సైనికుల దుర్మరణం. ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం.

► 2002 మే 14: కలుచాక్‌ ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడిలో 36 మంది సైనికులు నేలకొరిగారు.  

► 2001 నవంబర్‌ 17: రాంబన్‌లోని భద్రతా దళ స్థావరంపై ఉగ్రదాడి. 10 మంది సైనికులు మరణించారు. నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.  

► 2001 అక్టోబర్‌ 1: శ్రీనగర్‌లోని పాత శాసనసభ కాంప్లెక్స్‌ వెలుపల కారు బాంబు పేలుడు. 38 మంది దుర్మరణం. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.  

► 2000 ఆగస్ట్‌ 10: శ్రీనగర్‌లోని రెసిడెన్సీ రోడ్‌లో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్‌ దాడి, కారు బాంబు పేలుడు. 11 మంది సైనికులు, ఓ జర్నలిస్టు మరణించారు.

► 2000 ఏప్రిల్‌ 19: శ్రీనగర్‌లోని బాదామిబాగ్‌లో ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద తొలిసారిగా కారుతో ఆత్మాహుతి దాడి. ఇద్దరు సైనికులు మరణించారు.

► 1999 నవంబర్‌ 3: బాదామిబాగ్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్‌ వద్ద దాడి చేసి 10 మంది సైనికులను చంపేశారు.

మరిన్ని వార్తలు