గల్ఫ్‌లోని భారతీయుల జాబితా రూపొందించండి

9 May, 2017 00:44 IST|Sakshi
గల్ఫ్‌లోని భారతీయుల జాబితా రూపొందించండి

- విదేశాంగ శాఖ సమావేశంలో మంత్రి కేటీఆర్‌
- అక్కడి భారత ఖైదీలు స్వదేశంలో శిక్ష అనుభవించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి
- వలస కార్మికులకు న్యాయ సహాయంపై ప్రత్యేక పాలసీ ఉండాలి


సాక్షి, న్యూఢిల్లీ: గల్ఫ్‌ దేశాల్లోని వలస కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలకు అందించాలని కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి కె.తారక రామారావు కోరారు. వివిధ కేసుల్లో అరెసై్ట శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమ శిక్షాకాలాన్ని భారత్‌లో పూర్తి చేసేలా అన్ని గల్ఫ్‌ దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై సోమవారం ఢిల్లీలో విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రాల మంత్రుల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కేంద్రం అమలు చేయాల్సిన విధానపరమైన అంశాలపై ప్రజెం టేషన్‌ ఇచ్చారు. సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సహాయ మంత్రులు వీకే సింగ్, ఎం.జె. అక్బర్‌లతోపాటు కువైట్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్, యూఏఈ, మలేసియా తదితర దేశాల రాయబారులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. గల్ఫ్‌ కార్మి కుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. గల్ఫ్‌ దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో తెలుగు అనువాదకులను నియమించాలని, అవసరమైతే అనువాదకులను రాష్ట్రప్రభుత్వం పంపిస్తుందన్నారు. ఆయా దేశాల్లో స్థిరపడిన భారత సంతతి న్యాయవాదులు.. వలస కార్మికులకు న్యాయ సహాయం అందించేందుకు వీలుగా ఓ విధాన నిర్ణయం రూపొందించాలని సూచించారు. సౌదీలో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను స్వదేశం తీసుకు వచ్చే ప్రక్రియ చాలా ఆలస్యమవుతోందని కేంద్రం దృష్టికి తెచ్చారు. వలస కార్మికుల పాస్‌పోర్టులు ఆయా దేశాలు స్వాధీనం చేసుకోకుండా మానవ హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరారు. కార్మికుల విషయంలో వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు తెలుసుకునేందుకు మంత్రుల బృందం ఏర్పాటు చేయాలని కోరారు.

నకిలీ వర్సిటీల జాబితా పొందుపరచాలి..
తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వారి గురించి కేటీఆర్‌ ప్రస్తావించారు. విదేశాల్లోని నకిలీ వర్సిటీల జాబితా ను విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కోరారు. వీటిపై స్పందించిన సుష్మాస్వరాజ్‌ సాను కూల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌ దేశాల భారత కార్మికుల సమస్యలపై మూడు నెలలకోసారి చర్చించేలా అన్ని రాష్ట్రాల మంత్రులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌ కార్మికులు, విద్యార్థులను మోసగించే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ–సనద్‌ అటెస్టేషన్‌ కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రారంభించనున్నట్లు సుష్మ తెలిపారు. గల్ఫ్‌ కార్మికుల కోసం విదేశాంగ శాఖ చేపడుతున్న అవుట్‌రీచ్‌ కార్యక్రమాన్ని ఈ నెలలోనే హైదరాబాద్‌లో ప్రారంభించ నున్నట్లు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు