విమర్శ హద్దు దాటితే వ్యవస్థకే ప్రమాదం

1 Jun, 2020 06:48 IST|Sakshi
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌

జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం, దానికి గ్రేడింగ్స్‌ ఇవ్వడం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని వ్యవస్థలపై నెలకొన్న అసహనానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ వ్యాఖ్యానించారు. ‘నా తరువాత అంతా నాశనమే’ అన్న తరహాలో కొందరు మాజీ జడ్జీల తీరు ఉందన్నారు.  మద్రాస్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌  నిర్వహించిన ‘కోవిడ్‌ కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ’ అంశంపై ఆదివారం ఆయన ఆన్‌లైన్‌ ప్రసంగం చేశారు.  ‘గతంలో మన న్యాయవ్యవస్థలో భాగంగా ఉన్న కొందరిలో ఒక సమస్య ఉంది. నా తర్వాత∙అన్నీ తప్పులే జరుగుతున్నాయి అనే భావనలో వారున్నారు.

ఆ భావనే ప్రమాదకరం. ఇప్పుడు మాట్లాడుతున్నవారే గతంలో చాలా తప్పులు చేశారు’ అని అన్నారు. కొంతమందికి ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఇష్టమన్నారు. హద్దులు దాటి ఆరోపణలు చేయడం ‘తప్పుడు సమాచార మహమ్మారి’ వంటిదన్నారు. విమర్శలు అవసరమే కానీ హద్దులు దాటకూడదని సూచించారు. ‘విమర్శలు హద్దులు దాటితే వ్యవస్థపై అనుమానాలు ఎక్కువవుతాయి. ఏ వ్యవస్థకయినా అది మంచిది కాదు. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే వ్యవస్థే మనుగడలో లేకుండా పోతుంది. అప్పుడంతా అరాచకమే’ అని హెచ్చరించారు.

సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న వలస కూలీల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడానికి ఒక రోజు ముందు సుమారు 20 మంది ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేకు లేఖ రాశారు. వలస శ్రామికులపై కోర్టు చూపుతున్న నిర్లిప్తత సరికాదని వారు అందులో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ‘ఎప్పుడూ ప్రతికూల భావజాలాన్ని ప్రచారం చేసేవారు, ఇళ్లల్లో కూర్చుని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించే మేథావులు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు