వీటికి నకిలీ నోట్ల తయారీ అసాధ్యం

10 Nov, 2016 08:38 IST|Sakshi
వీటికి నకిలీ నోట్ల తయారీ అసాధ్యం
పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి, కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను తయారుచేయించడం వెనక కేవలం నల్ల ధనాన్ని అరికట్టడమే కాదు, నకిలీ నోట్లు అన్నవి లేకుండా చేయడం కూడా ప్రధాన ఉద్దేశం. కానీ, కొత్త నో్ట్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో కొత్త వాటికి కూడా నకిలీ నోట్లు తయారుచేసేస్తారు కదా అన్న అనుమానాలు సామాన్యలుకు ఉన్నాయి. వాటిని నిఘా సంస్థలు కొట్టి పారేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీ తయారుచేయడం దాదాపు అసాధ్యమేనని చెబుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు, బంగ్లాదేశ్‌లో నకిలీ నోట్లు తయారుచేసేవాళ్లు వీటిని కాపీ చేయడం కుదరని పని అని తేల్చి చెబుతున్నారు.

గత ఆరు నెలలుగా అత్యంత పటిష్ఠమైన భద్రతతో కూడిన ఈ కొత్త నోట్లు ప్రింట్ అవుతున్నా, ఆ విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. వీటిమీద పైకి చెబుతున్నవే కాకుండా ఇంకా చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో, డీఆర్ఐ తదితర సంస్థలు చెబుతున్నాయి. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ప్రత్యేకంగా భారతీయ కరెన్సీ నోట్లకు నకిలీలు ప్రింట్ చేయడానికే ఒక ప్రెస్ కూడా ఉందని నిఘావర్గాలు ఇంతకుముందే ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తెలిపాయి. 
 
ఈ ప్రెస్‌ ఐఎస్ఐ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రింట్ చేసిన నకిలీ నోట్లను దావూద్ ఇబ్రహీంకు చెందిన 'డి' కంపెనీ, లష్కరే తాయిబా, ఇతర అంతర్జాతీయ నేర గ్యాంగులతో భారతదేశంలోకి పంపుతుంది. నూటికి నూరుశాతం కచ్చితత్వంతో తాము భారతీయ నోట్లను ప్రింట్ చేశామని పాకిస్థాన్ వాళ్లు దాదాపు ఏడాది క్రితం ఒకసారి చెప్పారు. ప్రతియేటా భారతదేశంలోకి దాదాపు రూ. 70 కోట్ల విలువైన నకిలీ నోట్లను పంపుతుంటారు. 
 
అయితే కొత్త నోట్లలో ఉన్న అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను కాపీ కొట్టడానికి వాళ్ల దగ్గర ఉన్న పరిజ్ఞానం సరిపోదని, అసలు దాన్ని ఏ ఒక్కరూ కాపీ కొట్టలేరని నిఘావర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్ తన నకిలీ నోట్ల ప్రెస్‌ను ఇక మూసుకోవాల్సిందేనిన హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. మరోవైపు.. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలుచోట్ల కోర్టులలో సవాలు చేస్తున్నారు. ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకోవాలని ఇద్దరు న్యాయవాదులు బాంబే హైకోర్టును కోరారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లుబాటు కాదని జమ్షెడ్ మిస్త్రీ, జబ్బర్ షేక్ అనే న్యాయవాదులు అన్నారు. ఇంతకుముందు 1978 సంవత్సరంలో పెద్ద నోట్లను రద్దుచేసినప్పుడు ముందుగా ఒక ఆర్డినెన్సు, తర్వాత చట్టం చేశారని, ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండా నేరుగా ప్రకటించేశారని చెప్పారు.
>
మరిన్ని వార్తలు