పకోడాలు చేసినందుకు 20 వేల రూపాయల ఫైన్‌

17 Jul, 2018 12:07 IST|Sakshi
జేఎన్‌యూ క్యాంపస్‌లో పకోడాలు తయారుచేస్తున్న విద్యార్ధులు

ఢిల్లీ : క్యాంపస్‌లో పకోడాలు(మన భాషలో పకోడి) చేసినందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఓ ఎం.ఫిల్‌ విద్యార్ధిపై 20 వేల రూపాయల జరిమానా విధించడమే కాక హస్టల్‌ నుంచి వెళ్లి పోమ్మని ఆదేశాలు జారీ చేసింది విచారణ కమిషన్‌.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మనీష్‌ కుమార్‌ మీనా జెఎన్‌యూలో ఎం.ఫిల్‌ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ పకోడాలు అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం మనీష్‌, అతనితో పాటు చదువుతున్న మరో నలుగురు విద్యార్ధులు వెరైటిగా యూనివర్సిటీలోనే పకోడాలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు.

అయితే విద్యార్ధుల చేసిన చర్యలు క్యాంపస్‌ నియమాలకు వ్యతిరేకం అని చెప్పి వర్సిటీ అధికారులు వీరి చర్యలపై ఒక విచారణ కమిషన్‌ను వేశారు. ఆ కమీషన్‌ క్యాంపస్‌లో పకోడాలు వేయడం నేరం అని, ఇందుకు గాను మనీష్‌ కుమార్‌ 20 వేల రూపాయలు ఫైన్‌ కట్టాలని ఆదేశించింది. హస్టల్‌ నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. అయితే ఈ నిరసన కార్యక్రమాలు అన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. కానీ విచారణ కమిషన్‌ మాత్రం ఇప్పుడు విద్యార్ధులు థీసిస్‌ పేపర్లు సమర్పించే ముందు చర్యలు తీసుకుని వారిని హస్టల్‌ నుంచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే మనీష్‌ వర్సిటీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ‘స్వయంగా ప్రధాని మోదీనే పకోడాలను అమ్మి డబ్బు సంపాదించమని చెప్పారు. ఆయన చెప్పిన దానినే నేను పాటించాను. ప్రధాని మాటను విన్నందుకు నాకు జరిమాన విధించడమే కాక నన్ను హస్టల్‌ నుంచి వెళ్లిపొమ్మంటున్నారు. ఈ నెల 21 నాటికి నేను నా థీసిస్‌ పేపర్లను సబ్మిట్‌ చేయాలి. నా దగ్గర డబ్బు లేదు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం చూస్తే  వర్సిటీ కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఉంది. ఈ విషయంలో నేను కోర్టును ఆశ్రయించి చట్టపరంగా ముందుకు వెళ్తానని’ తెలిపారు.

ఈ విషయం గురించి విచారణ కమిషన్‌ ‘మనీష్‌ కుమార్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 5న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా సబర్మతి బస్‌ స్టాండ్‌ వద్ద ఆటంకం కలిగించాడు. ఫిబ్రవరి 9న కూడా రోడ్డు మీద పకోడాలను తయారు చేస్తూ రాకపోకలకు అంతరాయం కల్గించాడు. అందుకే అతని మీద ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపింది.

నిరసన కార్యక్రమాల్లో పాల్గోన్న విద్యార్ధుల మీద చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో సుభాన్షు సింగ్‌ అనే పీహెచ్‌డీ విద్యార్ధి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాడనే నేపంతో అతనికి 40 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం గురించి సుభాన్షు ‘నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి విద్యార్ధికి జరిమానా విధించారు. దీని వల్ల సమయం వృథా కావడమే కాక థీసిస్‌ పేపర్లను కూడా త్వరగా సబ్మిట్‌ చేయలేకపోతున్నాం. తప్పకుండా జరిమానా కట్టాల్సి రావడంతో డబ్బుల్లేక చాలా మంది విద్యార్ధులు బాధపడుతున్నారు. జేఎన్‌యూ చర్యలు మా గొంతును నొక్కివేసేలా ఉన్నాయని’ తెలిపారు.

మరిన్ని వార్తలు