వ్యాధుల గుప్పెట గిరిజనం

10 Sep, 2018 22:25 IST|Sakshi

జనాభాలో 8శాతం.. మలేరియా కేసులు 30 శాతం

మలేరియా మృతుల్లో సగం మంది గిరిజనులే

పెరిగిన బీపీ, క్యాన్సర్, మానసిక అనారోగ్యం కేసులు

ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటున్న నిపుణుల కమిటీ

గిరిజన ప్రాంతాల్లో అంటు వ్యాధుల తీవ్రత కొనసాగుతూనే వుందనీ, మరో వైపు – క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి సాంక్రమికేతర జబ్బులు (ఎన్‌సీడీ).. మానసిక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందనీ గిరిజన ఆరోగ్యంపై అధ్యయనం చేసిన నిపుణులు కమిటీ తన నివేదికలో వెల్లడించింది.  2013లో గ్రామీణ వైద్య నిపుణులు డాక్టర్‌ అభయ్‌ బంగ్‌ నేతృత్వాన ఆరోగ్య – గిరిజన మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన ఈ కమిటీ..  గత ఆగస్టులో నివేదిక సమర్పించింది. స్వతంత్రానంతరం –  గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై ఇలాంటి నివేదిక రావడం ఇదే తొలిసారి. నివేదిక ప్రకారం – జనాభాలో ఎనిమిది శాతంగా వున్న గిరిజనుల్లో – 30 శాతం మలేరియా కేసులు నమోదవుతున్నాయి.  మొత్తం పీ ఫాల్సీపారం మలేరియా బారిన పడుతున్న వారిలో గిరిజనులు 60 శాతం మంది. మొత్తం మలేరియా మృతుల్లో సగం మంది ఎస్టీలు. ఈ నేపథ్యంలో  గిరిజనులు అధికంగా జీవించే 91 జిల్లాల్లో –  నేషనల్‌ న్యూట్రిన్‌ మిషన్‌ కింద ఓ కార్యచరణ ప్రణాళిక (ట్రైబల్‌ మలేరియా యాక్షన్‌ ప్లాన్‌) అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

ఊపిరితిత్తుల సంబంధిత∙క్షయ వ్యాధి ఇతరుల్లో (లక్ష జనాభాకి 256) కంటే గిరిజనుల్లో  (703) ఎక్కువ ప్రబలుతోంది. ప్రతి నలుగురు గిరిజనుల్లో ఒకరు రక్తపోటు బారిన పడుతున్నారు. (జాతీయ సగటుతో సమానం). గనుల తవ్వకాలు, భూ సేకరణ వంటి కారణాల వల్ల వున్న చోటు వదిలి  వలస పోవాల్సిరావడం, జీవనోపాధి కోల్పోవడం, తీవ్రవాదం వల్ల చోటు చేసుకుంటున్న కల్లోల వాతావరణం, పర్యావరణపరమైన విపత్తులు గిరిజనుల్లో  పై తరహా జీవన శైలి వ్యాధులకు, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని నివేదిక విశ్లేషించింది. మత్తు పదార్థాల వాడకాన్ని నియంత్రించేందుకు, మాన్పించేందుకు, మానసిక ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. గిరిజన సబ్‌ ప్లాన్‌ కోసం ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖలు తగిన మేరకు నిధులు కేటాయించాలనీ, అన్ని రకాల ప్రభుత్వ బీమా పథకాలను ఎస్టీ లబ్ధిదారులకు వర్తింపచేయాలనీ సిఫారసు చేసింది.

అనేక రాష్ట్రాలు గిరిజన ఆరోగ్య సేవలకు తగినన్ని నిధులు కేటాయించకపోవడాన్ని / వినియోగించకపోవడాన్ని నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. వాస్తవిక వ్యయానికి సంబంధించి పారదర్శకత లోపించిందని పేర్కొంది. ‘తమకు వైద్యం చేసే వ్యక్తులు స్థానికులై వుండాలని గిరిజన సమాజం కోరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా వుంది. కాబట్టి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా స్థానిక గిరిజనుల్ని ఆరోగ్య సేవకుల్లో భాగం చేయాల్సివుంది’ అని కూడా నిపుణుల కమిటీ సూచించింది.

సర్కారీ ఆసుపత్రులే ఆధారం
నివేదిక ప్రకారం – దాదాపు 50 శాతం మంది గిరిజనులు  సర్కారీ ఆసుపత్రుల అవుట్‌ పేషెంట్‌ వార్డుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఇన్‌పేషెంట్లుగా చేరుతున్న వారిలో 66 శాతం మందికి పైగా గిరిజనులే. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముందని కమిటీ సూచించింది. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో  సబ్‌సెంటర్లు (27శాతం తక్కువ) పీహెచ్‌సీలు (40 శాతం)  కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (31శాతం) తగినన్ని లేకపోవడాన్ని కమిటీ ఎత్తిచూపింది.
సుశిక్షితులైన గిరిజన యువ వలంటీర్లు (ఆరోగ్య మిత్రలు), దాయీలు, ఆశాలతో ప్రా«థమిక వైద్య సేవల్ని బలోపేతం చేయడం..  గ్రామసభల /  గ్రామపెద్దల సహకారం తీసుకోవడం.. ప్రతి 50 కుటుంబాలకు ఒక ఆశా కార్యకర్తను నియమించడం..
గిరిజన ప్రాంతాల్లోని ప్రతి పీహెచ్‌సీ పరిధిలో (రెండు) వాహన ఆధారిత సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం..  వీటి ద్వారా –  ప్రాథమిక వైద్యం – గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు – వ్యాధి నిర్ధారణ – మందుల సరఫరా –  అంటు వ్యాధుల నియంత్రణ తాలూకూ సేవలు అందుబాటులోకి తీసుకురావడం..
గిరిజన ప్రాంత ఆరోగ్య ఉప కేంద్రాలను ట్రైబల్‌ హెల్త్‌ – వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు చేయడం.. తొలిదశలో  ప్రతి మూడు వేల గిరిజనులకు ఒకæ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.., ఆ తర్వాత కేంద్రాల సంఖ్య పెంచి,  ప్రతి 2000 జనాభాకు ఒకటి అందుబాటులోకి తీసుకురావడం సహా కమిటీ పలు విలువైన సిఫార్సులు చేసింది.

ఎస్టీల భాగస్వామ్యమే ముఖ్యం
వైద్య సేవలకు సంబంధించిన విధానాల రూపకల్పనలో, ప్రణాళికలో, అమలులో ఎస్టీ కమ్యూనిటీల పాత్ర నామమాత్రంగా వుండటాన్ని నివేదిక ఎత్తి చూపింది. గిరిజనుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించాల్సిన, బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ కార్యక్రమంలో – కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు వారిని పూర్తి భాగస్వాముల్ని చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. షెడ్యూల్డ్‌  ప్రాంతాల్లో నివసించని గిరిజనులు (5.78 కోట్ల మంది) ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా నిపుణుల కమిటీ కొన్ని సిఫారసులు చేసింది.
 

మరిన్ని వార్తలు