చనుబాలపై మరోసారి చర్చ

3 Mar, 2018 03:57 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన మళయాళం మ్యాగజైన్‌ కవర్‌ పేజీ

తల్లిపాలు బిడ్డలకు అమృతం.. వారి ఎదుగదలకు అదే ఆధారం..అమృత తుల్యమైన ఆ పాలను బహిరంగంగా ఇస్తే తప్పేముంది ..తల్లి పాలు తాగడం పిల్లల జన్మహక్కు.. వారికి ఆకలేసినప్పుడు ఎక్కడున్నా ఇవ్వాల్సిందే. దానిని కాదనడం ఎందుకు ? ఇప్పుడు దీనిపై మరోసారి చర్చ మొదలైంది.. మళయాళం మ్యాగజైన్‌ గృహలక్ష్మి ప్రచురించిన బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కవర్‌ పేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 27 ఏళ్ల మోడల్‌ గిలుజోసెఫ్‌ ఒక బిడ్డకు స్తన్యమిస్తున్న ఫోటోను ప్రచురించిన మ్యాగజైన్‌ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన పెంచడానికే తాము ప్రచారాన్ని ప్రారంభించినట్టు చెబుతోంది.. అయితే ఒక అందమైన పెళ్లి కాని మోడల్‌ను ఫోటో కవర్‌ పేజీపై వినియోగించడంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..ఆ ఫోటో అశ్లీలంగా ఉందంటూ కేసులు కూడా నమోదయ్యాయి. 

తల్లి పాలతో ఎన్నో ఉపయోగాలు
నవజాత శిశువులకు తల్లిపాలుకి మించిన ఆహారం లేదు. అందులో బిడ్డలు ఆరోగ్యంగా ఎదగడానికి కావల్సిన  పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. బిడ్డ పుట్టిన గంటలోపు వచ్చే ముర్రు పాలలో ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్‌ ఏ ఉండడం వల్ల ఎన్నో వ్యాధులు శిశువులకు సోకకుండా నిరోధించవచ్చు.  తల్లిపాలలో 90 శాతం నీరు, 75 శాతం వరకు ప్రొటీన్లు ఉంటాయి. శరీరానికి అత్యంత అవసరమయ్యే కొవ్వు పదార్థాలు . ల్యాక్టోజ్‌ అనే పిండిపదార్థం తల్లి పాలలో సమృద్ధిగా ఉంటాయి. 

సగానికిపైగా నవజాత శిశువులకు అందని తల్లిపాలు
వాస్తవానికి తల్లి పాలు ఇవ్వడంలో మన దేశంచాలా వెనుకబడి ఉంది. నాజూకు శరీరంపై మోజులో పడి ఎందరో మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వడం మానేశారన్నది జీర్ణించుకోలేని చేదు నిజం..గ్రామీణ భారతంలో బహిరంగ ప్రాంతాల్లో చనుబాల ఇచ్చే దృశ్యాలు సర్వసాధారణమే అయినప్పటికీ, నగరాల్లో ఆ పరిస్థితి లేదు..అందుకే బహిరంగ ప్రాంతాల్లో స్తన్యం ఇవ్వొచ్చన్న చట్టాన్ని తీసుకురావాలని,. ప్రతీ బిడ్డకు కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు పట్టడం తప్పనిసరి చేస్తూ  కేంద్రమే చట్టం చెయ్యాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

మన దేశంలో పుడుతున్న చిన్నారుల్లో కేవలం 44 శాతం మందికి మాత్రమే తల్లి చనుబాల అందుతోంది..మిగిలిన 66 శాతం మంది పిల్లలు పోత పాల మీదే బతుకుతున్నారని జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతీ ఏడాది తల్లి పాలు అందక పౌష్టికాహార లోపంతో లక్ష మంది శిశువులు చనిపోతున్నారు. అదే తల్లులు బిడ్డలకు పాలు ఇస్తే నవజాత శిశు మరణాలను 13 శాతం తగ్గించవచ్చునని అంచనా

విదేశాల్లో ఎలా ?
మన దేశంలో బహిరంగంగా తల్లి పాలు పట్టాలంటే సంకోచిస్తారు.. ఎలాంటి చూపులు ఎదుర్కోవాలో అని సందేహిస్తారు. కానీ చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో తల్లి పాలు ఇవ్వడం అదొక హక్కు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, ఫిలిప్పీన్స్, ఆఫ్రికా, నేపాల్‌ వంటి దేశాల్లో తల్లి పాలు బహిరంగంగా ఇవ్వొచ్చని చట్టాలు కూడా చేశారు. 

గతంలోనూ చర్చ
ఆస్ట్రేలియా సెనేటర్‌ లరిస్సా వాటర్‌  గత ఏడాది పార్లమెంటులోనే బిడ్డకు చనుబాలు ఇవ్వడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. బహిరంగ ప్రదేశాల్లో బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై అంతర్జాతీయ వేదికగా చర్చ జరిగింది. ప్రఖ్యాత టైమ్, బేబీ టాక్‌ మ్యాగజైన్‌లు కూడా గతంలో బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫోటోలను కవర్‌ పేజీలుగా ప్రచురించాయి. తల్లిపాలు బిడ్డలకు ఇవ్వడం వారికి రక్షణ æమాత్రమే  కాదు జాతికి కూడా ఎంతో మేలు..
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ )

మరిన్ని వార్తలు