ఎమ్హెచ్ 370 గల్లంతు : పైలట్ ఆత్మహత్యే కారణమా?

10 Jun, 2016 09:11 IST|Sakshi
ఎమ్హెచ్ 370 గల్లంతు : పైలట్ ఆత్మహత్యే కారణమా?

మలేసియా:  ఎమ్హెచ్ 370 విమానం గల్లంతుపై ఆరు నెలలు గడిచిపోయింది.  ఇంతవరకు ఆ విమానం ఆచూకీ తెలియకపోవడంతో రోజుకో పుకారు షికారు చేస్తుంది. అంతేకాకుండా ఆ విమానం గల్లంతుపై పుస్తకాలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా కివీ ఎయిర్ లైన్స్ స్థాపకుడు, న్యూజిలాండ్లో విమాన ప్రమాదాలపై విచారణాధికారి ఇవాన్ విల్సన్ 'గుడ్ నైట్ మలేసియా 370: ద ట్రూత్ బిహైండ్ ద లాస్ ఆఫ్ ఫ్లైట్ 370' పేరిట ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఎమ్హెచ్ 370 విమానం దుర్ఘటనతోపాటు గత 30 ఏళ్లలో చోటు చేసుకున్న విమాన ప్రమాదాలను ప్రస్తావించారు. కాగా ఎమ్హెచ్  370 పైలట్ కెప్టెన్ జహీర్ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకున్నాడని అందువల్లే విమానం గల్లంతైందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

అంతేకాకుండా అతడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని... ఈ నేపథ్యంలో అతడు విమానంలోని ప్రతి ఒక్కరు మరణించాలని భావించాడని తెలిపారు. అందుకే పైలట్ గుడ్నైట్ అని మలేసియా విమానాశ్రయ అధికారులకు సందేశం పంపిన కొద్ది సేపటికే విమానం గల్లంతైందంటూ మరీ ఉదాహరణ చూపారు. అయితే రచయిత పుస్తకంలోని వ్యాఖ్యలను మలేసియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అనీఫ్ అమన్ ఖండించారు. అవి సత్య దూరాలని ఆరోపించారు. పుస్తకంలోని వ్యాఖ్యల వల్లే ప్రయాణికుల బంధువుల్లో ఇప్పటికే పడుతున్న ఆందోళన మరింత తీవ్రం అవుతుందన్నారు. విమానం గల్లంతుపై త్వరలో వార్త దొరికే అవకాశం ఉందని అన్నారు.   అంతేకాకుండా ఆ విమాన పైలేట్ కెప్టెన్గా 1990వ సంవత్సరంలో మొదట్లో ఉద్యోగంలో చేరారని... దాదాపు 33 ఏళ్ల విమాన పైలట్గా కొనసాగారని చెప్పారు.  

ఈ ఏడాది మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరింది. ఆ విమానంలో బయలుదేరిన కొద్ది సేపటికే గల్లంతైంది. ఆ విమాన ఆచూకీ కోసం ప్రపంచ దేశాలు కలసి జల్లెడ పట్టిన ఇప్పటి వరకు వీసమెత్తు ఆచూకీ కూడా కనుక్కోలేకపోయారు. దీంతో ప్రయాణికుల బంధువులు మలేసియా ప్రభుత్వంపై ఇప్పటికే నిప్పులు చెరుగుతున్నారు. కాగా రకరకాల పుకార్లు, ఇలాంటి పుస్తకాలుతో ప్రయాణికుల కోపానికి ఆజ్యం పోసినట్లు అవుతుందని మలేసియా ప్రభుత్వం భావిస్తుంది.

మరిన్ని వార్తలు