నేరం చేసానని ఒప్పుకోమని హింసిస్తున్నారు

14 Jun, 2018 10:42 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘2008, మాలేగావ్‌ పేలుళ్ల కేసు’లో ప్రధాన నిందుతుడుగా శిక్ష అనుభవిస్తున్న మాజీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ ప్రసాద్‌ పురోహిత్‌ గతంలో రాసిన ఒక ఉత్తరం ఇప్పుడు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతుంది. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రధాన నిందుతుడిగా మహారాష్ట్ర ‘యాంటి టెర్రరిజమ్‌ స్క్వాడ్‌’(ఏటీఎస్‌) కస్టడీలో ఉన్న సమయంలో ఏటీఎస్‌ అధికారులు తనను విపరీతంగా టార్చర్‌ చేస్తున్నారని 2013, డిసెంబర్‌లో ‘జాతీయ మానవ హక్కుల కమిషన్‌’కు ఓ 24 పేజీల లేఖ రాసాడు పురోహిత్‌.

నావీ ముంబై జైల్‌లో ఏటీఎస్‌ కస్టడీలో ఉన్నప్పుడు వారు తనను బలవంతంగా నేరం ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. తాను ఏ నేరం చేయలేదని కానీ ఏటీఎస్‌ అధికారులు మాత్రం తనను కొట్టి, హింసించి తన చేత బలవంతంగా నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపాడు. కేవలం ఏటీఎస్‌ అధికారులు మాత్రమే కాక ఆర్మీ అధికారులు కూడా తనను హింసించారని, అంతేకాక తనచేత బలవంతంగా మరో ఆరుగురు అధికారుల పేర్లను కూడా చెప్పించారని పేర్కొన్నాడు.

2008, సెప్టెంబర్‌ 29న మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా, మాలేగావ్‌లో జరిగిన ఈ పేలుళ్లలో ఏడుగురు మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అరెస్టయిన పురోహిత్‌కు గతేడాది సెప్టెంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పురోహిత్‌ రాజకీయ కుట్రల వల్లనే తాను తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపానని తెలిపాడు.

పురోహిత్‌ రాసిన లేఖ గురించి పోలీసు అధికారులు ‘పురోహిత్‌ ఈ లేఖను 2013లో రాసాడు...అప్పుడే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఈ విషయాన్ని దర్యాప్తు చేసింది. అంతేకాక పురోహిత్‌ లేఖలో పేర్కొన్న అధికారులు కూడా పురోహిత్‌ ఆరోపణలపై స్పందించార’ని పోలీసు అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు