‘సీబీఐ వార్‌’లోకి కాంగ్రెస్‌

4 Nov, 2018 04:23 IST|Sakshi
అలోక్‌ వర్మ, మల్లికార్జున్‌ ఖర్గే

అలోక్‌ వర్మను సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకెళ్లిన కాంగ్రెస్‌

సీవీసీ, డీఓపీటీ ‘అర్ధరాత్రి’ ఆదేశాలు చెల్లవు

కోర్టులో ఖర్గే పిటిషన్‌

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అధికారాల్ని తొలగించడం చట్టవిరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడిందని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్‌ చట్టబద్ధ అధికారాలు తొలిగించి, ఆయన్ని సెలవుపై పంపుతూ అక్టోబర్‌ 23 అర్ధరాత్రి దాటిన తరువాత కేంద్ర విజలెన్స్‌ కమిషన్‌(సీవీసీ), సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) జారీచేసిన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే శనివారం కోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలుచేశారు.

ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం(డీఎస్‌పీఈఏ) ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలానికి రక్షణ ఉందని, హైపవర్డ్‌ కమిటీ ఆమోదం లేనిదే ఆయన్ని బదిలీ కూడా చేయరాదని గుర్తుచేశారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపికచేసే హైపవర్డ్‌ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అలోక్‌ వర్మను సెలవుపై పంపుతూ ఆదేశాలు జారీచేసే ముందు కమిటీ సభ్యుడినైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీవీసీ, డీఓపీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

కమిటీ సమావేశం లేకుండానే కానిచ్చేశారు
అలోక్‌ వర్మ అధికారాలు, విధులు తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు..సీబీఐ స్వతంత్రతను దెబ్బతీసేందుకు నేరుగా జరిగిన మూకుమ్మడి ప్రయత్నాలు అని ఖర్గే అభివర్ణించారు. సీబీఐలో ముదిరిన వివాదంపై చర్చించడానికి కమిటీ సమావేశం కాలేదని అక్టోబర్‌ 25నే లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ‘సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడి యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘించిన సంగతిని సంబంధిత భాగస్వామిగా కోర్టు దృష్టికి తెస్తున్నా.

డైరెక్టర్‌ అధికారాల్ని తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు చట్టవిరుద్ధం. సీబీఐ డైరెక్టర్‌పై చర్య తీసుకునే అధికారాలు సీవీసీకి లేవని చట్టాలు చెబుతున్నాయి. ఎంపిక కమిటీని తక్కువచేసేలా డీఎస్‌పీఈ చట్టం కింద కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టరాదు’ అని ఖర్గే పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలానికి రక్షణనిస్తున్న డీఎస్‌పీఈ చట్టం ప్రకారం హైపవర్డ్‌ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ పాత్రకు పూర్తి వ్యతిరేకంగా డీఓపీటీ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు.

మధ్యవర్తికి బెయిల్‌ నిరాకరణ
సీబీఐ అవినీతి కేసులో అరెస్టయిన మధ్యవర్తి మనోజ్‌ ప్రసాద్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. బెయిల్‌ కోరుతూ ప్రసాద్‌ పెట్టుకున్న అర్జీని జడ్జి శనివారం తోసిపుచ్చారు. ఈ దశలో ఆయనకు బెయిల్‌ మంజూరుచేయడం సరికాదని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి ఎంతో పలుకుబడి ఉందని, బెయిల్‌పై విడుదల అయితే విచారణను ప్రభావితం చేయగలడని సీబీఐ వాదించింది. తనను కస్టడీలో ఉంచడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్న ప్రసాద్‌ పిటిషన్‌తో కోర్టు విభేదించింది. అక్టోబర్‌ 17న అరెస్టయిన ప్రసాద్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన సహ నిందితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్‌కు అక్టోబర్‌ 31నే బెయిల్‌ లభించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా