విజయ్ మాల్యాను వెనక్కి రప్పిస్తాం

22 Apr, 2016 19:44 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టిన విజయ మాల్యాను స్వదేశానికి రప్పించే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందించింది. అతడిని విచారణ నిమిత్తం భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్యా, పిల్లలు ఎన్నారైలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించక్కర లేదని మాల్యా ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.   

ఈ నేపథ్యంలో మాల్యా కేసుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఈడీ సంప్రదించింది. దీంతో మాల్యా తమ న్యాయవాదులకు అందుబాటులో ఉన్నారని, అతడిని వెనక్కి తీసుకు వచ్చేందుకు (డిపోర్టేషన్) తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ ఈడీ ఇచ్చిన అభ్యర్థన తమ శాఖకు అందిందని, ఆయా విషయాలపై తాము న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.

మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఈడీ గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకూ విదేశాలకు మళ్ళించారన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదన.

ఇదే కేసుపై విచారించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతవారం మాల్యా దౌత్య పాస్ పోర్ట్ ను సస్పెండ్ చేసింది. అయితే సదరు వ్యాపారవేత్త డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని, కేసు విచారణకు  సరిగా సహకరించడంలేదని ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్టు ఎందుకు రద్దు చేయకూడదంటూ ఈడీ ప్రశ్నిస్తోంది.

మరిన్ని వార్తలు