మురికివాడల పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ

20 Aug, 2019 10:20 IST|Sakshi

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు చేరువయ్యేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా ‘దీదీ కో బోలో’ వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతేకాక మురికివాడల్లో ఆకస్మిక పర్యటనలు కూడా చేపడతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హౌరా ప్రాంతంలోని ఓ మురికి వాడలో పర్యటించారు దీదీ. ఆ సమయంలో ఆమెతో పాటు పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ వ్యవహరాల శాఖ మంత్రి ఫిర్హాధ్‌ హకీమ్‌ కూడా ఉన్నారు. పర్యటనలో భాగంగా దీదీ అక్కడి ప్రజల స్థితి గతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో 400మంది నివసిస్తున్న ఆ ప్రాంతంలో కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నట్లు దీదీ దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీని గురించి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హకీమ్‌ను వివరణ అడిగారు దీదీ. ‘మురికి వాడల అభివృద్ధి కోరకు ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. కానీ ఇక్కడ 400 మందికి కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాంత కౌన్సిలర్‌ ఏక్కడ.. ఏం చేస్తున్నాడు’ అంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హకీమ్‌ స్పందిస్తూ.. కౌన్సిలర్‌ ఓ హత్యా నేరం కింద ప్రస్తుతం జైలులో ఉన్నాడని.. అందుకే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని తెలిపాడు. అందుకు దీదీ.. ‘కౌన్సిలర్‌ జైలులో ఉన్నాడు సరే.. మున్సిపాలిటీ ఇక్కడే ఉంది కదా. మీరు పర్యవేక్షించడం లేదా. 400 మంది కోసం కేవలం రెండు మరుగుదొడ్లు ఎలా సరిపోతాయి. కనీసం 8,10 అయినా ఉండాలి కదా. మీకొక వారం రోజుల గడువు ఇస్తున్నాను. ఈ లోపు అన్ని మురికివాడల్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించండి’ అంటూ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు