బీజేపీపై దీదీ సంచలన ఆరోపణలు

23 Apr, 2019 18:43 IST|Sakshi

కోల్‌కతా : బీజేపీకి ఓట్లు వేయాలని కేం‍ద్ర బలగాలు ఓటర్లను కోరుతున్నాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమం‍త్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓటు వేయాలని మల్ధాహదక్షిణ్‌, బలూర్‌ఘాట్‌ నియోజకవర్గాల్లోని ఓటర్లను కేంద్ర బలగాలు కోరాయని ఆమె ఆరోపించారు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీకి సమాచారం అందచేసిందని మమతా బెనర్జీ వెల్లడించారు.

మాల్ధాహదక్షిణ్‌ నియోజకవర్గంలోని ఇంగ్లీష్‌బజార్‌ ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలు తిష్టవేసి బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. వారికి అలా చెప్పే హక్కు లేదని, దీనిపై తమ అభ్యంతరాలను ఈసీకి నివేదించామని వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలకు పనేముందని ఆమె ప్రశ్నించారు. కేంద్ర బలగాలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆమె ఆరోపించారు. 2016లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే తీరున వ్యవహరించిందని దుయ్యబట్టారు. బెంగాల్‌ ప్రజలు బీజేపీకి దీటుగా బదులిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు