ఆమెది రాజకీయ ఫ్రస్ట్రేషన్: పారికర్

2 Dec, 2016 11:25 IST|Sakshi
భారత సైన్యం గురించి పశ్చిమబెంగాల్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో తనకు చాలా బాధ కలిగిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది రాజకీయ ఫ్రస్ట్రేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆర్మీ చేస్తున్న రొటీన్ ఎక్సర్‌సైజ్ అని.. చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉందని లోక్‌సభలో చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ సచివాలయంలోని తన చాంబర్‌లోనే ధర్నా చేస్తున్నారని, ముందుగా పోలీసులకు.. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే వచ్చినట్లు సైన్యం చెబుతున్నా, నిజానికి అలా జరగలేదని టీఎంసీ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించగా, దానికి సమాధానంగా పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
గత 15 సంవత్సరాలుగా భారత సైన్యం ఇలా వెళ్తూనే ఉందని, ఇదేమీ కొత్త కాదని పారికర్ వివరించారు. గత సంవత్సరం కూడా నవంబర్ 19-21 తేదీల మధ్య ఇలా జరిగిందని అన్నారు. పశ్చిమబెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలకు ఈస్ట్రన్ కమాండ్ వెళ్తుందని, అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతుందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చిందన్నారు. వాస్తవానికి నవంబర్ నెలాఖరులో 28, 29, 30 తేదీలలో ఈ ఎక్సర్‌సైజ్ చేద్దామని ఆర్మీ భావించి అక్కడి పోలీసు అధికారులను సంప్రదిస్తే.. ఆ సమయంలో భారత్ బంద్ ఉన్నందున వాళ్లు తేదీలు మార్చి చెప్పారని, అందుకే సైన్యం ఇప్పుడు వెళ్లిందని పారికర్ వివరించారు. పోలీసులతో కలిసే సైన్యం సంయుక్తంగానే ఎక్సర్‌సైజ్ చేసిందని అన్నారు. సైన్యం చేసే రొటీన్ ఎక్సర్‌సైజును వివాదం చేయడం మాత్రం తప్పని ఆయన అన్నారు.
మరిన్ని వార్తలు