‘యాప్‌ల నిషేధం సరిపోదు’

30 Jun, 2020 18:27 IST|Sakshi

చైనాపై చర్యలకు దీదీ మద్దతు

సాక్షి, న్యూఢిల్లీ : చైనా యాప్‌ల నిషేధంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కొన్ని యాప్‌లను నిషేధించడం సరిపోదని.. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు మనం దీటుగా స్పందించాలని దీదీ అన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది కేంద్రం నిర్ణయించాలని అన్నారు. మమతా బెనర్జీ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నా పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.

చైనాపై నిర్ధిష్ట చర్యలు ఎలా ఉండాలో ప్రభుత్వమే నిర్ణయించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చైనాకు దీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని దీదీ వ్యాఖ్యానించారు. విదేశాంగ వ్యవహారాల్లో తలదూర్చరాదన్నది తృణమూల్‌ కాంగ్రెస్‌ విధానమని పేర్కొన్నారు. చైనాకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. 

చదవండి : రైళ్లు, విమానాల స‌ర్వీసుల‌ను ఆపేయండి : మ‌మ‌తా

మరిన్ని వార్తలు