కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ

21 May, 2020 11:21 IST|Sakshi

కోల్‌కతా: అతి తీవ్ర తుపాను ‘ఉంపన్‌’ వల్ల  పశ్చిమ బెంగాల్‌లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ తుపాన్‌ తీవ్రంగా మారటంతో 12 మంది మృతి చెందారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఉంపన్‌ తుపాన్‌ ప్రభావం కరోనా వైరస్‌ కంటే తీవ్రంగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ తుపాన్‌ను ఘోర విపత్తుగా ఆమె పేర్కొన్నారు. తుపాన్‌ తీవ్రతను ఆమె కంట్రోల్‌ రూం ద్వారా బుధవారం పర్యవేక్షించారు. తుపాన్‌ భారీ వర్షం, తీవ్రమైన గాలితో విలయతాండవం సృష్టించిందని ఆమె చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి తీవ్ర తుపాన్‌ సంభవించిందని ఆమె అన్నారు. ‘నేను వార్‌ రూమ్‌లో కూర్చు న్న సమయంలో నా కార్యాలయంపై తుపాన్‌ ప్రభావం తీవ్రంగా పడింది’ అని సీఎం మమాతా బెనర్జీ తెలిపారు. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం)

ఈ తుపాన్‌ వల్ల సముద్ర తీర ప్రాంత ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు ఇళ్లు కూలిపోయి, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాలు పడిపోవటంతో కరెంట్‌ నిలిచిపోయింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. తుపాన్‌ వల్ల 125 కిలో మీటర్ల వేగంతో గాలి వీచటంతో ప్రజలు భయభ్రాతులకు గురయ్యారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తుపాన్‌ ప్రభావంతో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా మూసివేసిన కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో వర్షపు వరద నీరు చేరింది. ఇక బెంగాల్‌లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా ఉంపన్‌ తీరం దాటిన విషయం తెలిసిందే. (శివసేన రాంపూర్‌ జిల్లా మాజీ అధ్యక్షుడి దారుణ హత్య)

మరిన్ని వార్తలు