జమ్మూ కశ్మీర్‌ బిల్లు : కేంద్రం తీరుపై దీదీ ఫైర్‌

6 Aug, 2019 13:58 IST|Sakshi

కోల్‌కతా : జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మోదీ సర్కార్‌ తీరును పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుపెట్టారు. జమ్మూ కశ్మీర్‌ వ్యవహారంలో కేంద్రం అనుసరించిన ప్రక్రియ అప్రజాస్వామికమని మండిపడ్డారు. కశ్మీర్‌ అంశంపై ఓటింగ్‌, సమగ్ర చర్చ లేకుండా ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరిస్తున్న క్రమంలో బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని ఆమె స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించాలని దీదీ డిమాండ్‌ చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు వ్యవహారం మంగళవారం లోక్‌సభలోనూ పెను ప్రకంపనలు రేపింది.

ఆర్టికల్‌ 370ను ద్వైపాక్షిక అంశంగా ఎందుకు పరిగణించడం లేదంటూ హోంమంత్రి అమిత్‌ షాను కాంగ్రెస్‌ సభ్యుడు అధీర్‌ రంజన్‌ చౌదరి ప్రశ్నించడంతో సభలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కశ్మీర్‌పై కాంగ్రెస్‌ వైఖరిని స్పష్టం చేయాలంటూ అమిత్‌ షా నిలదీయడంతో అధీర్‌ రంజన్‌ తీరుతో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడింది.

మరిన్ని వార్తలు