సీబీఐ వేధింపులతోనే ఆ నేత మరణం..

19 Feb, 2020 14:02 IST|Sakshi

కోల్‌కతా : కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులతోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, బెంగాల్‌ నటుడు తపస్‌ పాల్‌ గుండెపోటుతో మరణించారని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ఒత్తిళ్లతో ఇటీవల ముగ్గురు మరణించారని ఆమె అన్నారు. తృణమూల్‌ మాజీ ఎంపీ సుల్తాన్‌ అహ్మద్‌ తొలుత మరణించగా, పార్టీ ఎంపీ ప్రసూన్‌ బెనర్జీ తర్వాత కన్నుమూయగా తాజాగా తపస్‌ పాల్‌ను కేంద్రం బలిగొందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వేధింపులు, రాజకీయ కక్షసాధింపు చర్యలతోనే వీరు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా తపస్‌ పాల్‌ (61) గుండెపోటుతో ముంబై ఆస్పత్రిలో మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. తపస్‌ పాల్‌ హఠాన్మరణంపై తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం పతాకస్ధాయికి చేరింది. తపస్‌ పాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ చేసిన పాపాలకు బలిపశువు అయ్యారని బీజేపీ తృణమూల్‌ ఆరోపణలను తిప్పికొట్టింది. గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన తపస్‌ పాల్‌ దీర్ఘకాలంగా గుండె, నరాల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా పలుసార్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. డిసెంబర్‌ 2016 రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ కేసుకు సంబంధించి సీబీఐ గతంలో ఆయనను అరెస్ట్‌ చేసింది.

చదవండి : ఢిల్లీ ఫలితాలు : ‘2021లో ఏం జరుగుతుందో చూడండి’

మరిన్ని వార్తలు