ప్రశాంత్‌ కిషోర్‌కు మమత నుంచి అత్యవసర పిలుపు

23 Apr, 2020 11:28 IST|Sakshi

కోల్‌కతా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి అత్యవసర పిలుపు వచ్చింది. కరోనా వ్యాధి విషయంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ప్రతిపక్ష బీజేపీ నాయకులు విమర్శలతో దూసుకుపోతుండటంతో, ఈ క్లిష్ట సమయంలో తమకు మార్గదర్శకం చేయాలంటూ ప్రశాంత్‌కిషోర్‌కు మమత కార్యాలయం నుంచి కబురు అందింది. ప్రస్తుతం పీకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌ కారణంగా ‘బం‍గ్లార్‌ గార్బో మమతా’ ప్రచార కార్యక్రమానికి తెరపడంతో ప్రశాంత్‌కిషోర్‌ ఢిల్లీ వెళ్లిపోయారు. తిరిగి దీదీ నుంచి పిలుపురావడంతో కార్గో విమానంలో పశ్చిమబెంగాల్‌ చేరుకున్నారు. అయితే ప్రశాంత్‌ వచ్చిన సమయంలోనే, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్రంపంపించిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ సభ్యులు కూడా కోల్‌కతా చేరుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో, న్యూస్‌ ఛానళ్లలో కరోనా మహమ్మారి విషయంలో మమత ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే పనులను ప్రశాంత్‌ కిషోర్‌ పర్యవేక్షించనున్నారు.

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారంటూ మమతా ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఐటీ విభాగం ఎండగట్టుతుంది. రాష్ట్రంలో పదిలక్షల మందిలో సగటున కేవలం 198 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేయడంపై బీజేపీ పెద్దలు కూడా మమత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.(టెస్టుల్లో ఏపీ ఫస్ట్‌) ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువులను సైతం  రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని టీఎంసీ నేతలపై మండిపడుతున్నారు.

అంతేకాకుండా లాక్‌డౌన్‌ సమయంలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తబ్లిగి జమాత్‌కి వెళ్లొచ్చిన వారు క్వారంటైన్‌ ఉండకుండా మమతానే వారికి అండగా ఉంటుందని, వారిని అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వీడియోలతోపాటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.  ఇలాంటి ఘటనలతో బెంగాల్‌ మొత్తం ఇబ్బందులు పడే అవకాశం ఉందని బీజేపీనేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

దీనికి తోడూ జాతీయ, అంతర్జాతీయ మీడియాసైతం మమత ప్రభుత్వవైఫల్యాలపై కథనాలు ప్రచురించడం, కేంద్ర ప్రభుత్వం కూడా బెంగాల్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి ఎప్పటికప్పుడు బృందాలను పంపించడం మమతకు పెద్ద తలనొప్పిగా మారింది. 

2019 సార్వత్రిక ఎన్నికల్లోనే ఎన్నడూలేని విధంగా బీజేపీ బాగా పుంజుకుంది. ఏకంగా 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ పార్టీకి బీజేపీ సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడటానికి పీకేని అత్యవసరంగా బెంగాల్‌కు పిలిపించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు