మమత రెండోసారి...

28 May, 2016 00:48 IST|Sakshi
మమత రెండోసారి...

పశ్చిమబెంగాల్ సీఎంగా మమత ప్రమాణం
- హాజరైన కేంద్రమంత్రి జైట్లీ, బిహార్, యూపీ, ఢిల్లీ సీఎంలు
- కార్యక్రమాన్ని బహిష్కరించిన బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్
 
 కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(61) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పశ్చిమబెంగాల్‌ను పాలించిన వామపక్షాలను మట్టికరిపించి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మమత.. వరుసగా రెండోసారీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు నితీశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వేలాదిగా అభిమానులు హాజరైన కార్యక్రమంలో గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ.. మమతచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించగా.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, అశోక్ గజపతి రాజు, బాబుల్ సుప్రియోలు మమత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా, డీఎంకే తరఫున కణిమొళి, మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ, భూటాన్ పీఎం షెరింగ్ తాబ్గే, మమత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మమతతో పాటు 41 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో 28 మంది కేబినెట్ మంత్రులుగా, 13 మంది సహాయమంత్రులుగా నియమితులయ్యారు. మమత తన తాజా టీంలో 18 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం విశేషం. ప్రమాణం అనంతరం పలువురు మంత్రులు మమతకు పాదాభివందనం చేశారు. ప్రమాణ కార్యక్రమానికి కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి కార్లో బయల్దేరే ముందు.. కొద్దిదూరం నడిచి, అభిమానులకు అభివాదం చేశారు. కార్యక్రమం ముగియగానే నేరుగా సచివాలయానికి వెళ్లారు.
 
 కొత్త ఫ్రంట్‌కు పునాది!?
 మమత నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమి!
 బెంగాల్ సీఎంగా మమత రెండోసారి ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కొత్త వేదిక నిర్మాణానికి అడుగులు పడుతున్నాయనే సంకేతాలిచ్చింది. బిహార్ ఎన్నికలకు ముందు జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, ఇతరపార్టీలు మహాకూటమికి తెరలేపినా పలుకారణాలతో దీనికి బ్రేక్ పడింది. బిహార్‌లో నితీశ్, లాలూ కూటమి గెలిచినా.. మూడో కూటమి ఏర్పాటుపై పెద్దగా అంచనాలు పెరగలేదు. కానీ, బెంగాల్‌లో భారీ మెజార్టీతోప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మమత నాయకత్వంలోనే ఈ వేదిక రూపుదిద్దుకోవచ్చనే వాదన బలంగా వినబడుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో.. ఆ పార్టీని, మోదీని ఎదుర్కోగల సత్తా ఉన్న కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు ఈ కార్యక్రమం పునాది కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మమత ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ వ్యతిరేకశక్తులైన వివిధ పార్టీలనుంచి కీలక నేతలు (నితీశ్, లాలూ, కేజ్రీవాల్, ఫరూఖ్ అబ్దుల్లా, కణిమొళి) హాజరు కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. కార్యక్రమం తర్వాత లాలూ మాట్లాడుతూ.. ‘బీజేపీ-ఆరెస్సెస్ వ్యతిరేక శక్తులు ఏకమవనున్నాయి’ అని చెప్పటం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. ఒకవేళ ఈ కొత్త వేదిక ఏర్పడితే.. దీనికి నేతృత్వం వహించే నేత ఎవరనే అంశమూ ఆసక్తికరంగా మారింది. ఈ ఫ్రంట్‌లోని నేతలంతా నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నవారే. ప్రమాణం అనంతరం ‘భారత దేశపు తొలి బెంగాల్ ప్రధాని కానున్నారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నను మమత తోసిపుచ్చకపోవటం. ఎవరైనా ప్రధాని కావొచ్చని చెప్పడం కొత్త వేదిక ఆలోచనలకు బలం చేకూరుస్తోంది.

మరిన్ని వార్తలు