నిన్న మోదీ చాయ్‌.. నేడు దీదీ చాయ్‌

22 Aug, 2019 08:38 IST|Sakshi

కోల్‌కతా: ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే చాలు.. నాయకులు తమలోని అపరిచితులను ప్రజలకు పరిచయం చేస్తారు. నాలుగేళ్ల పాటు జనాల ముఖాలు కూడా చూడని నాయకులకు ఉన్నట్టుండి ప్రజలపై ప్రేమ పొంగుకొస్తుంది. దాంతో జనాలను ఆకట్టుకోవడానికి రకరకాల విద్యలు ప్రదర్శిస్తారు. ఫలితాలు వచ్చి ఎన్నికల తంతు ముగిసాక.. కథ మళ్లీ మొదటికొస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మరికొన్ని రోజుల్లో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ప్రారభించారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం దీదీ దిఘా ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.             (చదవండి: ‘వారి లవ్‌ ఎఫైర్‌తో షాకయ్యా’)

పర్యటనలో కాసేపు బ్రేక్‌ తీసుకున్న దీదీ ఓ చాయ్‌ దుకాణం వద్ద ఆగారు. అనంతరం టీ స్టాల్‌ ఓనర్‌తో మాట్లాడుతూ.. కాసేపు చాయ్‌వాలా అవతారం ఎత్తారు దీదీ. చాయ్‌ తయారీకి కావాల్సిన పదార్థాల గురించి అడుగుతూ.. స్వయంగా తన చేతులతో టీ తయార్‌ చేశారు దీదీ. అంతటితో ఊరుకోక దాన్ని పేపర్‌ కప్పులో పోసి అక్కడే ఉన్న జనాలకు అందించారు. టీ ఎలా ఉందంటూ ప్రశ్నిస్తూ కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు దీదీ. దాంతో పాటు ‘జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. టీ తయారు చేసి దాన్ని ఇతరులతో పంచుకోవడం అలాంటి వాటిల్లో ఒకటి. ఈ రోజు దిఘలో నేను అదే పని చేశాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. అంతేకాక వంటచేయడం అన్నా, కిచెన్‌లో గడపడం అన్నా తనకెంతో ఇష్టమని.. కానీ సమయం లేకపోవడం వల్ల వంట చేయడానికి వీలు చిక్కడం లేదని తెలిపారు దీదీ. అయితే ఈ వీడియోపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నిన్న మోదీ చాయ్‌.. నేడు దీదీ చాయ్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు