కీలక భేటీకి దీదీ, ఉద్ధవ్‌లు దూరం

18 Jun, 2019 17:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏకకాల ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బుధవారం జరగనున్న అఖిలపక్ష భేటీకి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే హాజరు కావడం లేదు. ఒకే దేశం..ఒకే ఎన్నికలు అనే అజెండాపై ప్రభుత్వం ముందస్తు సమాచారం లేకుండా తక్కువ వ్యవధిలో సమావేశం ఏర్పాటు చేసిందని, దీనిపై సలహాలు, సూచనలు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి రాసిన లేఖలో మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

జమిలి ఎన్నికలపై రాజ్యాంగ నిపుణులు, ఎన్నికల నిపుణులతో పాటు అన్ని పార్టీల సభ్యులతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని, ఇంతటి కీలకమైన అంశంపై హడావిడిగా చర్చలు జరపలేమని ఆమె పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఈ ప్రతిపాదనపై సూచనలు ఆహ్వానిస్తూ నిర్ధిష్ట కాలపరిమితిలో ఈ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ చర్యలు చేపడితే తాము నిర్ధిష్ట సూచనలు అందించే వెసులుబాటు ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో అఖిల పక్ష భేటీకి హాజరు కాలేనని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే సమాచారం అందించినట్టు తెలిసింది. శివసేన బుధవారం 53వ వ్యవస్ధాపక దినం జరుపుకుంటున్న క్రమంలో ఆయా కార్యక్రమాల్లో ఉద్ధవ్‌ థాకరే నిమగ్నం కానున్నారు. మరోవైపు ఏకకాల ఎన్నికలపై సంప్రదింపులు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ప్రధాని మోదీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇక ఈనెల 20న ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలందరికీ విందు ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు