‘కూలిన చోటే నిలువెత్తు‍ విగ్రహం’

11 Jun, 2019 14:37 IST|Sakshi

కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నెలరోజుల కిందట ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసమైన క్రమంలో అదేచోట పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం విద్యాసాగర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రాజకీయ నేతలు, మేథావులు, బెంగాలీ నటుల సమక్షంలో విద్యాసాగర్‌ విగ్రహానికి దీదీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మే 14న బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా రోడ్‌షో సందర్భంగా విద్యాసాగర్‌ కళాశాలలో నెలకొల్పిన విద్యాసాగర్‌ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ హామీ ఇచ్చిన మేరకు ఇదే కళాశాలలో పునర్‌నిర్మించిన విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. కోల్‌కతా కాలేజ్‌ స్ట్రీట్‌లోని విద్యాసాగర్‌ కాలేజ్‌లో ఆరు అడుగుల ఎత్తైన విద్యాసాగర్‌ విగ్రహాన్ని విద్యార్ధులు, మేథావులు, రాజకీయ నేతల హర్షధ్వానాల మధ్య ఆమె ఆవిష్కరించారు. బెంగాలీ సంస్కృతితో పాటు సమాజ వికాసానికి, విద్యావ్యాప్తికి ఆయన చేసిన కృషి అసామాన్యమని దీదీ ఈ సందర్భంగా కొనియాడారు.

మరిన్ని వార్తలు