సర్జికల్‌ స్ట్రైక్‌ 2 వివరాలు వెల్లడించండి

28 Feb, 2019 20:55 IST|Sakshi

కోల్‌కతా : సంచలనాలకు మారుపేరైన  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మెరుపు దాడుల గురించి కథలు కథలుగా ప్రచారం చేస్తుంటే.. దీదీ మాత్రం బాంబులెక్కడ వేశారు.. అసలు ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.

మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సైన్యానికి మేము పూర్తి మద్దతిస్తాం. కానీ దాడులకు సంబంధించి పూర్తి వాస్తవాలను వెల్లడించండి. మెరుపు దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అంతర్జాతీయ మీడియా వీటిని ఖండిస్తోంది. మాకు వాస్తవాలు కావాలి. మీరు సరిగ్గా టార్గెట్‌ మీదనే బాంబుల వర్షం కురిపించారా.. లేదా చెప్పండి. ఒకవేళ మీ ప్రయత్నం విఫలమైతే ఒక్కరు కూడా చనిపోరు కదా. అందుకే మెరుపు దాడులకు సంబంధించిన వాస్తవాలను బహిరంగ పర్చండ’ని కోరారు.

అంతేకాక జవాన్ల త్యాగాలను, దేశం కోసం వారు చిందించిన రక్తాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే సహించమన్నారు. పుల్వామా దాడి తర్వాత కానీ, మెరుపు దాడులు అనంతరం మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని మమత మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు