కోవిడ్‌ -19 : నిపుణులతో దీదీ కమిటీ

6 Apr, 2020 19:40 IST|Sakshi

కోల్‌కతా : కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ అభిజిత్‌ బందోపాధ్యాయ్‌ వంటి నిపుణులతో సలహా కమిటీని ఏర్పాటు చేస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. డాక్టర్‌ అభిజిత్‌ బందోపాథ్యాయ్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారని, ఆర్థిక వ్యవస్థ భవితవ్యంపై సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లేదని, ఇలా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, భవిష్యత్‌ కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని దీదీ అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి భారీగా విరాళాలు వస్తాయని, కానీ తమకు మాత్రం చిల్లిగవ్వ రావడం లేదని, దీనిపై తనకు అసూయ ఏమీ లేదని ఆమె చెప్పుకొచ్చారు. టీ తోటలను తిరిగి తెరిపించడంపై కేంద్రం తమను కోరిందని, అయితే దీనిపై తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని చెప్పారు. ఇక బెంగాల్‌లో ఇప్పటివరకూ 61 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఏడు కుటుంబాల నుంచే 55 కేసులు వెలుగుచూశాయని అన్నారు. బెంగాల్‌లో మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ ముగ్గురు మరణించారని, 13 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు.

చదవండి : లాక్‌డౌన్‌కు కౌంట్‌డౌన్‌ !

మరిన్ని వార్తలు