ఆమ్లెట్‌ వేస్తే....ప్లాస్టిక్‌ బయటకు వచ్చింది..

1 Apr, 2017 15:45 IST|Sakshi
ఆమ్లెట్‌ వేస్తే....ప్లాస్టిక్‌ బయటకు వచ్చింది..

కోల్‌కతా: ప్లాస్టిక్‌ రైసే కాదు...ప్లాస్టిక్‌ ఎగ్స్‌ కూడా మార్కెట్‌లో వచ్చేశాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో  ప్లాస్టిక్‌ కోడిగుడ్ల విక్రయం కలకలం రేపుతోంది. ఓ మహిళకు ప్లాస్టిక్‌ కోడిగుడ్లు విక్రయించిన ఓ దుకాణదారుడు కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది.  కోల్‌కతాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో దుకాణదారుడిని  పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.  పార్క్‌ సర్కస్‌ మార్కెట్‌ వద్ద షమీమ్‌ అన్సారీ షాపు నిర్వహిస్తున్నాడు. అతని వద్ద గురువారం సాయంత్రం అనిత కుమార్‌ అనే మహిళ కోడిగుడ్లు కొనుగోలు చేసింది.

ఇంటికి వెళ్లాక వాటితో ఆమ్లెట్‌ వేసేందుకు గుడ్డును పెనం మీద వేయగానే, ప్లాస్టిక్‌లాగే గట్టిపడింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె ... అగ్గిపుల్లతో ఆ గుడ్డును వెలిగించగా, మంటలు వచ్చాయి. గుడ్డు పై పెంకు కూడా ప్లాస్టిట్‌లా ఉండటంతో, అది సహజమైన కోడిగుడ్డు కాదని నిర్థారణకు వచ్చిన ఆమె కరయ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుకాణదారుడిని అదుపులోకి తీసుకుని, దుకాణంలోని కోడిగుడ్లను సీజ్‌ చేశారు.

కాగా అన్సారీ ఆ గుడ్లను రూ.1.15 లక్షలకు హోల్‌సేల్‌ గా కొనుగోలు చేసినట్లు పోలీసులు విచారణలో తెలిపాడు.  అలాగే ఈ గుడ్లు సరఫరా చేస్తున్న హోల్ సేల్ వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు కోల్‌కతా మున్సిపల్‌ కార్పోరేషన్‌ కూడా దీనిపై విచారణకు ఆదేశించింది.