విమానంలో మహిళపై వికృత చేష్టలు

30 Jun, 2017 16:35 IST|Sakshi
విమానంలో మహిళపై వికృత చేష్టలు

ముంబయి: విమాన ప్రయాణంలో మహిళ గాఢ నిద్రలో ఉండగా తోటి ప్రయాణికుడు ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. నిద్రిస్తున్న మహిళను అభ్యంతరకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. చివరికి మహిళ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

జూన్ 27న ఉదయం 6:15 నిమిషాలకు బెంగళూరు నుంచి ఓ విమానం ముంబై బయలుదేరింది. 31 ఏళ్ల సబీన్‌ హంజా అనే వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడి పక్క సీట్లో ఓ మహిళా ప్రయాణికురాలు కూర్చొని ఉంది. విమానం బయలుదేరిన కొద్దిసమయానికి తన పక్క సీట్లో కూర్చున్న మహిళ నిద్రించడం గమనించిన హంజా ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఏదో అలికిడికి ఉలిక్కిపడి లేచిన ప్రయాణికురాలు జరుగుతున్న సీన్ చూసి షాక్ తిన్నారు. తోటి ప్రయాణికుడు తనను చెప్పలేని చోట తాకుతూ లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఆమె ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

సిబ్బంది అక్కడికి వచ్చేలోగా ఆ వ్యక్తి ప్యాంట్ జిప్ పెట్టుకుని తనకేం తెలియదన్నట్లు కూర్చున్నాడని బాధితురాలు తెలిపారు. తొలుత నిందితుడు హంజాను సిబ్బంది హెచ్చరించి వదిలేశారు. 7:45 గంటలకు ముంబైకి విమానం చేరుకోగానే హంజాను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు