సీఎంను హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్‌!

1 Apr, 2020 13:22 IST|Sakshi

పాట్న: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను హత్య చేసిన వారికి రూ. 25లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేసిన ఓ వ్యక్తిని పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం లూథియానాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రోహ్‌తాస్ జిల్లాలోని తోడా గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ పాండే అనే వ్యక్తి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను హత్యచేసిన వారికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ ఓ వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో  పోస్ట్‌ చేశాడు. (పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌)

దీంతో విషయం తెలుసుకున్న రోహ్‌తాస్‌ పరిధిలోని దినారా స్టేషన్‌ హౌస్‌ పోలీసు ఆఫీసర్‌ సియారామ్ సింగ్.. ధర్మేంద్రను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కాగా, పోస్టు చేసిన వీడియో, మొబైల్‌ నంబర్‌ అధారంగా నిందితుడు ఉన్న లోకేషన్‌ లూథియానాగా చేధించినట్లు సియారామ్‌ తెలిపారు. అదేవిధంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. దీనిపై రోహ్‌తాస్‌ పోలీసు సూపరింటెండెంట్‌ సత్యవీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నిందితున్ని అదుపులోకి తీసుకున్న లూథియానా పోలీసులు, ధర్మేంద్ర మానసిక స్థితి సరిగా లేదనే సందేశాన్ని తమకు పంపించారని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు