కాకికి కబురంపితే..

14 Jul, 2019 08:35 IST|Sakshi
కాకితో ప్రశాంత్‌ పూజారి.. కాకి పిల్ల.. నేడు వీఐపీ

సాక్షి, బెంగళూరు : ఉపాయం ఉంటే ఏదీ వృథా కాదు. ఉడుపి జిల్లా కాపుకు చెందిన ఒక యువకుడు కాకిని ఒక వ్యాపార వస్తువుగా ఉపయోగిస్తున్నారు. పిండ ప్రదానాల్లో వంటకాలను కాకితో తినిపించడం ద్వారా కాసులు ఆర్జిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే మూడు, హిందూ సంప్రదాయం ప్రకారం 11 రోజుల వైకుంఠ సమారాధన రోజున వారికి ఇష్టమైన వంటకాలను వండి బయట నైవేద్యంగా పెడతారు. ఆ వంటకాలను కాకి ముట్టుకుంటే చాలని భావిస్తారు. ఆ తరువాతే బంధువులకు తిథి భోజనం వడ్డిస్తారు. ఇదే ప్రశాంత్‌పూజారి అనే యువకునిలో ఆలోచన రేకెత్తించింది. పల్లెల్లో ఎక్కడైన కాకులు కనపడుతాయి. మరీ పట్టణాలు, నగరాల్లో వాటి సంతతి క్షీణిస్తోంది. తిథి వంటకాలను కాకులు ముట్టుకోవడం ఎంతోసేపు నిరీక్షిస్తే కానీ జరగడం లేదు. ఈ లోటును ఉడుపి సమీపంలో కాపులోనున్న ప్రశాంత్‌ పూజారి పెంచుతున్న కాకి తీర్చుతోంది. కరావళి ప్రాంతం లో కాకులు లేకపోవటంతో ప్రశాంత్‌పూజారి దశ తిరిగింది.  

చాలా డిమాండ్‌
ఇది ప్రశాంత్‌కు ఎంతో సంతృప్తినిచ్చింది. ఇలా అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ప్రశాంత్‌ తన వద్ద సమారాధనలకు కాకి దొరుకుతుందని ఫేస్‌బుక్‌లో సందేశం పెట్టాడు. దీనిని తెలుసుకున్న వారు అతనికి ఒకరోజు ముందుగా ఫోన్‌ చేసి పిలుపిస్తారు.  అలా కాకితో అతడి తల రాత మారిపోయింది. పిలిపించుకున్నవారు అతనికి పారితోషికంతో పాటు మర్యాదులు ఇస్తాన్నారు. డిమాండ్‌ పెరగటంతో నేడు ముందుగానే బుకింగ్‌ చేసుకొనే స్థాయికి తన వ్యాపారం పెరిగిందని ప్రశాంత్‌ చెప్పాడు. రూ.500 నుంచి రూ.2 వేల వరకు డబ్బులిస్తున్నారు. ఉడుపి ప్రాంతంలో కాకుల సంఖ్య చాలా తక్కువ కావడంతో అతడికీ మంచి డిమాండ్‌ పెరిగింది. ఎంత డబ్బులైన ఇస్తామంటూ కాకిని రప్పించుకోని కార్యాలను పూర్తి చేస్తున్నారు. కొందరు అతడిని కారులో తీసుకోచ్చి కారులోనే పంపుతున్నారు. నా కాకికి డిమాండ్‌ ఉంది, నేను డిమాండ్‌ చేయటం లేదు అని ప్రశాంత్‌ తెలిపాడు.  

ఓ రోజు తన ఇంటి ముందున్న చెట్టు మీద గూడు నుంచి మూడు కాకి పిల్లలు పడిపోయాయి. వాటిని చూసిన ప్రశాంత్‌ పూజారి మూటింటిని ఒక బుట్టలో ఉంచి పెంచుతుండగా రెండు పిల్లలు చనిపోయాయి. ఒక్కటి మాత్రమే బతికింది. దీనికి అతడు ముద్దుగా రాజా అని పేరు పెట్టుకున్నాడు.  కొన్నిరోజులకు సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు మూడు రోజుల శాస్త్రం చేశారు. వంటకాలు వండి  పల్లెంలో పెట్టారు. ఏ కాకి రాలేదు. దీనితో తన కొడుకుపై ఎవరికీ ప్రేమలేదని మృతుని తల్లిదండ్రులు చింతించసాగారు. మళ్లీ 11వ రోజు వైకుంఠ సమారాధనకు కాకి ముట్టుకోకుంటే ఏమిటని యోచనలో పట్టారు. మృతుడి సమీప బంధువుకు ప్రశాంత్‌ పూజారి గురించి తెలిసి ఫోన్‌చేసి పిలిపించాడు.తన కాకితో వంటకాలను తినిపించి ఆ కన్నవారి శోకాన్ని కొంచెం తీర్చాడు. 

మరిన్ని వార్తలు