1500 ​కిలోమీటర్లు ప్రయాణించిన శవం

30 May, 2018 11:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాట్నా : రైలులో ప్రయాణిస్తూ గుండెపోటుకు గురై మరణించిన ఓ వ్యాపారి శవం ఎవరూ గుర్తించకపోవడంతో ఏకంగా 1500 కిలోమీటర్లు ప్రయాణించింది. దాదాపు 72 గంటల తర్వాత శవాన్ని గుర్తించటంతో సంఘటన ఆలస్యంగా వెలుగులో​కి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌​ అనే వ్యాపారి ఈ నెల 24న పాట్నా-కోట ఎక్స్‌ప్రెస్‌లో ఆగ్రాకు బయలుదేరాడు. ఉదయం 7-30 గంటల సమయంలో తన భార్యకు ఫోన్‌ చేసి ఆరోగ్యం సరిగాలేదని చెప్పాడు.

కొద్దిసేపటి తర్వాత అతని భార్య ఫోన్‌ చేసినప్పటకీ భర్త నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భార్యకు ఫోన్‌ చేసిన తర్వాత టాయ్‌లెట్‌కు వెళ్లిన సంజయ్‌ గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు. టాయిలెట్‌లో శవం ఉన్న సంగతి ఎవరూ గుర్తించకపోవడంతో అలా 1500 కిలోమీటర్లు ప్రయాణించి పాట్నా చేరుకుంది. పాట్నా చివరి స్టేషన్‌ కావడంతో ప్రయాణికులు దిగిన తర్వాత రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించారు.

బోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బందికి టాయిలెట్‌లో నుంచి దుర్వాసన వస్తుండటం గమనించారు. టాయిలెట్‌ తలుపులు తెరచి చూడగా అందులో శవం ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. శవం దగ్గర ఉన్న ఐడీ కార్డు సహాయంతో మృతుడిని సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌గా పోలీసులు గుర్తించారు. బోగిలోని టాయ్‌లెట్‌ లోపలి నుంచి లాక్‌ అయ్యిందని 1500 కిలోమీటర్లు ప్రయాణించినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.  

మరిన్ని వార్తలు