ఆకలి దప్పులతో నడిరోడ్డుపైనే కన్నుమూత

3 May, 2020 13:34 IST|Sakshi

సాధారణ దగ్గుకు వైరస్‌ ముద్ర

ఇంట్లోకి అనుమతించని సోదరి, స్థానికులు

ఆకలి దప్పులతో నడిరోడ్డుపైనే వ్యక్తి కన్నుమూత

సాక్షి ప్రతినిధి, చెన్నై: కరెంటు షాకు తగిలి ఒక కాకి కిందపడితే వందలాది కాకులు చుట్టుముడుతాయి. ఒక వానరం గాయపడితే లెక్కలేనన్ని కోతులు వచ్చి అది కోలుకునేదాకా సపర్యలు చేస్తుంటాయి. పశుపక్ష్యాదుల్లో ఉన్న జాలి, దయా గుణం సాటి మానవుల్లో కనిపించడంలేదు. చెన్నైలో ఒక వ్యక్తి అకారణంగా ప్రాణాలు కోల్పోయాడు. స్వయానా సోదరి సైతం కరోనా వ్యాధిగ్రస్తునిగా ముద్రవేసి రోడ్డు పాలుచేయగా అతడు నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఒక రూము తీసుకుని రవి (53) కూలీపనులు చేసేవాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా రూమును ఖాళీచేసి చెన్నై కుమరన్‌ నగర్‌ సమీపం జాఫర్‌ఖాన్‌లోని తన సోదరి ఇంట్లో ఉండేవాడు.

ఇటీవల అతడికి తీవ్రమైన దగ్గు రావడంతో వైరస్‌ లక్షణాలుగా అనుమానించి వైద్యపరీక్షలకు వెళ్లివచ్చాడు. సోదరి, పరిసరాల్లోని ప్రజలు అతడిని అనుమతించలేదు. ప్రజలు తీవ్రంగా అడ్డుకోవడంతో అదే ప్రాంతంలో సోదరి ఇంటికి వంద అడుగుల దూరంలో రోడ్డు వారగా ఉండిపోయాడు. కనీసం ఆకలి, దప్పులు తీర్చేందుకు సైతం ఎవ్వరూ అతడి వద్దకు రాలేదు. గమనించుకునేవారు లేక ఆకలితో అలమటించిపోయాడు. ఆరోగ్య కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ శుక్రవారం ఉదయం జాఫర్‌ఖాన్‌పేటకు వచ్చారు. రోడ్డు వారగా ఉన్న రవి వద్దకు వెళ్లి పరిశీలించగా ప్రాణాలు కోల్పోయి ఉండడంతో గగుర్పాటుకు గురయ్యారు. వెంటనే కార్పొషన్‌ అధికారలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌ వచ్చింది. రోగి మరణించడంతో ఎక్కించుకోనని అంబులెన్స్‌ డ్రైవర్‌ నిరాకరించాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు రవి చనిపోగా సాయంత్రం 4.30 గంటల వరకు శవం రోడ్డుపైనే ఉండిపోయింది.

ఆ తరువాత చెన్నై కార్పొరేషన్‌ కోడంబాక్కం మండలాధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తిచేసి రవి భౌతికకాయాన్ని అప్పగించేందుకు సిద్ధం కాగా అతడి సోదరి నిరాకరించారు. అంతేగాక సోదరి ఇంటి యజమాని కూడా అంత్యక్రియలు జరిపేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.  పోస్టుమార్టం రిపోర్టు రాగా రవికి కరోనా వైరసే కాదు ఎలాంటి అనారోగ్యం లేదని తేలింది. కరోనా అనుమానంతో ఒక వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయేందుకు పరోక్షంగా కారకులైన స్థానికులను కొందరు దుయ్యబడుతున్నారు.

మరిన్ని వార్తలు