కరోనాతో వ్యక్తి మృతి : భారత్‌లో తొలి కేసు..!

11 Mar, 2020 14:30 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

కరోనాతో బెంగళూరు వాసి మృతి

నిర్థారించని ప్రభుత్వం

సాక్షి, బెంగళూరు :  ప్రపంచ దేశాల్లో మరణ మృదంగాన్ని మోగిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లోనూ తన ప్రభావాన్ని తీవ్రంగానే చూపుతోంది. కరోనా వైరస్‌ కారణంగా కర్ణాటకలో ఓ వ్యక్తి మృతి చెందాడనే వార్త తీవ్ర భయాందోళనలను సృష్టిస్తోంది. ఇటీవల సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకు చేరుకున్న ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో కల్బుర్గీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కొద్ది రోజుల పాటు చికిత్స సజావుగానే సాగినా.. అతని పరిస్థితితో మాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని కల్బుర్గీ నుంచి మరో ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేశారు వైద్యులు. అయితే చికిత్స పొందుతూనే బుధవారం మధ్యాహ్న సమయంలో బాధితుడు మృతి చెందాడు.

అయితే మృతి చెందిన వ్యక్తిని మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధిఖీగా గుర్తించిన వైద్యులు అతని మరణం కరోనా కారణంగానే సంభవించిందని నిర్థారించలేకపోతున్నారు. అతని శాంపిల్స్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలకు రిఫర్‌ చేశామని, రిపోర్టులు అందిన తరువాతనే మృతిపై నిర్థారణకు వస్తామని వైద్యులు తెలిపారు. కాగా భారత ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇప్పటి వరకే దేశంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. 

టెక్కీ భార్య, కూతురికీ కోవిడ్‌
మరోవైపు ఐటీ సిటీ బెంగళూరు సహా కర్ణాటకలో నాలుగు కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక టెక్కీకి కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారణ చేయగా, మరో ముగ్గురికి ఈ వైరస్‌ సోకినట్లు మంగళవారం వెల్లడైంది. 24 గంటల వ్యవధిలో మరో మూడు కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కాగా, మంగళవారం కొత్తగా బెంగళూరులో మరో మూడు కోవిడ్‌ వైరస్‌ కేసులు గుర్తించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఒక ప్రకటనను విడుదల చేసింది. మొదట సోకినట్లు తేలిన టెక్కీ (41) బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఛాతీ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నాడు. కాగా, మంగళవారం ఆయన భార్య, కుమార్తె, సహచర ఉద్యోగికి కూడా ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు వారితో పాటు విమానంలో వచ్చిన ప్రయాణికులను, అలాగే బాధితుడు కలిసివారిని పిలిపించి అందరికీ వైద్యపరీక్షలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సోమవారం సుమారు 68 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది.  (కరోనా : మహిళ పరిస్థితి విషమం)

భయాందోళనలు వద్దు: సీఎం యడ్డీ
కోవిడ్‌ కేసుల విజృంభణతో ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప వైద్యారోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్‌ వైరస్‌ బాధితులు, ఇతరత్రా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బయట దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, కుటుంబాలకే వైరస్‌ సోకిందని, రాష్ట్రంలో ఉంటున్నవారికి సోకినట్లు నిర్ధారణ కాలేదని తెలిపారు. ఎవరూ భయాందోళనలకు గురికావొద్దని, మాస్కులు ధరించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు