ఊపిరి ఆడటం లేదంటూ 50 ఆస్ప‌త్రులు..

1 Jul, 2020 16:29 IST|Sakshi

బెంగళూరు: కొన్ని సంఘ‌ట‌న‌లు మాన‌వ‌త్వం ఇంకా మిగిలే ఉందా? అన్న సందేహాన్ని క‌లిగిస్తాయి. ఊపిరి ఆడ‌టం లేదంటూ ఎన్ని ఆసుప‌త్రులు తిరిగినా ఏ ఒక్క‌రూ క‌నిక‌రించ‌క‌పోవ‌డంతో ఓ వ్య‌క్తి ప్రాణాలు విడిచాడు. ఆదివారం బెంగళూరులో చోటు చేసుకున్న ఈ హృ‌ద‌య విదార‌క‌ ఘ‌ట‌న మానవ‌త్వానికి మాయ‌ని మ‌చ్చ‌గా నిలిచింది. బెంగ‌ళూరులోని నాగారాథ్‌పేట్‌కు చెందిన 50 ఏళ్ల వ్య‌క్తి క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌పడుతున్నాడు. ఈ క్ర‌మంలో ఆదివారం అత‌నికి ఒక్కసారిగా ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. దీంతో ఓ అంబులెన్స్ బుక్ చేసుకుని ప్రభుత్వ ఆసుప‌త్రి స‌హా 17 ప్రైవేటు ఆసుప‌త్రుల చుట్టూ తిరిగాడు. కానీ అత‌ని ప్ర‌య‌త్నం వృధా ప్ర‌యాసే అయింది. ఒక్క బెడ్డు కూడా ఖాళీ లేద‌ని నిర్ల‌క్ష్యంగా స‌మాధాన‌మిస్తూ ఆసుప‌త్రి అధికారులు అత‌డిని తిప్పి పంపించేశారు. దీంతో అత‌ని కుటుంబం ఇంట్లోనే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ఏర్పాటు చేసింది. (అవసరమైన ప్రతి వ్యక్తికీ కరోనా పరీక్షలు)

అయిన‌ప్ప‌టికీ అత‌ని ప‌రిస్థితి క్ష‌ణ‌క్ష‌ణానికి మ‌రింత దిగ‌జారింది. దీంతో కుటుంబ స‌భ్యులు మ‌రోసారి ఆస్ప‌త్రుల మెట్లెక్కి కాపాడ‌మ‌ని వేడుకున్న‌ప్ప‌టికీ ఏ ఒక్క ఆసుప‌త్రీ అత‌డిని చేర్పించుకునేందుకు అంగీక‌రించ‌లేదు. కొన్ని గంట‌ల త‌ర్వాత‌ అత‌డు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వేళ బోరింగ్ ఆసుప‌త్రి అత‌డిని చేర్చుకునేందుకు అంగీక‌రించింది. అయితే అత‌డిని వెంటిలేట‌ర్‌పై పెట్టిన 10 నిమిషాల‌కే మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న‌పై అత‌ని అల్లుడు మాట్లాడుతూ.. "నేను సుమారు 50 ఆసుప‌త్రుల చుట్టూ తిరిగాను.. ఎంతో మందిని క‌లిశాను.. అంద‌రూ చెప్పిన ఒకే ఒక మాట బెడ్లు ఖాళీగా లేవ‌ని! ఓ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి అధికారులు మాట్లాడుతూ అత‌డి ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంటే ఐసీయూలో చేర్చాలి కానీ త‌మ ద‌గ్గ‌ర ఐసీయూ ఖాళీ లేద‌ని  చెప్పారు. ఇవ‌న్నీ చూసి మాన‌వ‌త్వం చ‌చ్చిపోయిన‌ట్లు అనిపించింది" అని వాపోయాడు. మ‌రోవైపు బాధితుడికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ ఫ‌లితాలు ఇంకా తెలియ‌రాలేదు. (ఖననం.. మానవత్వం హననం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా