పంజాబీ డ్రెస్‌లో దొరికిపోయాడు!

27 May, 2020 16:40 IST|Sakshi

సూర‌త్‌: లాక్‌డౌన్‌లో భార్యాభ‌ర్త‌ల‌కు ఒక‌రి ముఖాలు మ‌రొక‌రు చూసుకోలేక త‌ల‌లు తిప్పుకుంటే ప్రేమికులు మాత్రం దూరంగా ఉంటూ విర‌హ వేద‌న అనుభ‌విస్తున్నారు. లాక్‌డౌన్ విధించి ఇప్ప‌టికే రెండు నెల‌లు దాటిపోయింది. ఇప్ప‌ట్లో దీన్ని ఎత్తేస్తారో లేదో కూడా తెలీదు. దీంతో త‌న ప్రేయ‌సిని చూడ‌కుండా ఎదురుచూపుల‌తో కాలం వెళ్ల‌దీయడం త‌న ‌వ‌ల్ల కాద‌నుకున్నాడో ప్రేమికుడు. ప్రేయ‌సి కోసం అమ్మాయి అవ‌తారం ఎత్తి అంద‌రి క‌న్నుగప్పి ఆమె ముందు వాలిపోదామ‌నుకున్నాడు. కానీ అత‌డి ప్లాన్ బెడిసి కొట్టింది. గుజ‌రాత్‌కు చెందిన ఓ యువ‌కుడు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నాడు. వారి ప్రేమ పాఠాల‌కు లాక్‌డౌన్ అడ్డొచ్చిప‌డింది. దీంతో ఎలాగైనా అమ్మాయిని క‌ల‌వాల‌నుకున్నాడు. ప్ర‌జారవాణా బంద్ ఉండ‌టంతో బైక్‌పై వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. (లాక్‌డౌన్ ల‌వ్‌: యాచ‌కురాలితో ప్రేమ, ఆపై)

అమ్మాయిల‌నైతే పోలీసులు ఆప‌ర‌నుకున్నాడో ఏమో కానీ, పంజాబీ డ్రెస్ వేసుకుని త‌ల‌మీద దుపట్టా ధ‌రించి, ఫేస్ మాస్క్ పెట్టుకుని మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ప‌య‌న‌మ‌య్యాడు. వ‌ల్సాద్ ప్రాంతంలోని పోలీసులు అత‌డిని నిజంగానే అమ్మాయిగా భావించి అడ్డుకోలేదు. కానీ మ‌రోసారి అదే రూట్‌లో బైక్ మీద వెళుతుండ‌టం చూసి అత‌ని వాహనాన్ని అడ్డుకున్నారు. "ఈ స‌మ‌యంలో ఎందుకు బ‌య‌టకు వ‌స్తున్నారు?" అని ప్ర‌శ్నించారు. గొంతు విప్పితే దొరికిపోతాన‌న్న భ‌యంతో అత‌డు చేతి ద్వారా సంజ్ఞ‌లు చేశాడు. అత‌డి తీరుతో అనుమానం వ‌చ్చిన పోలీసులు ఈసారి దుప‌ట్టా తీసి మాట్లాడాల్సిందిగా రెట్టించి అడగ్గా అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు, తన ప్రియురాలి తల్లిదండ్రులు గుర్తించ‌కుండా ఉండేందుకు ఇలా అమ్మాయి వేష‌ధార‌ణ‌తో గ‌ర్ల్ ఫ్రెండ్‌ను క‌లిశాన‌ని పేర్కొన్నాడు. కాగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల కింద పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.. (‘13ఏళ్లు ఒంటరిగానే.. ఇంకెంత కాలం?’)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా