లిఫ్ట్‌ ఇవ్వటం ‘మహా’ పాపం

25 Jun, 2018 14:23 IST|Sakshi

పాపం పోనీ అని లిఫ్ట్‌ ఇవ్వటం ఆ వ్యక్తి పాలిటే శాపంగా మారింది. హఠాత్తుగా ఊడిపడ్డ ట్రాఫిక్‌ అధికారి చలాన్‌ రాసి చేతిలో పెట్టాడు. ముంబైకి చెందిన  నితిన్‌ నాయర్‌ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు రూపంలో తెలియజేశాడు. జూన్ 18న ముంబై ఐరోలి సర్కిల్‌లో నితిన్ వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం భారీగా పడుతుండటం, పైగా రవాణా సదుపాయం లేకపోవటంతో ముగ్గురు వ్యక్తులు కష్టపడుతుండటం అతని కంట పడింది. వెంటనే వారిని తన కారులో ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ వెంటనే నితిన్ వద్దకు వచ్చి రూ. 1500 చలాన్ రాసిచ్చాడు. అంతేకాదు నితిన్ డ్రైవింగ్ లైసెన్స్ లాక్కుని ఛలాన్‌ కట్టి వాహనం తీసుకెళ్లాలని సూచించాడు. అయితే ఆ టైమ్‌లోనూ నితిన్‌ సాయం చేయటం మానలేదు. వారిని వారి వారి గమ్యస్థానంలో వదిలి మరుసటి రోజు కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి బయటపడ్డాడు. తన అనుభవాన్ని నితిన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. నితిన్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని, అందుకే అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్‌ పేరుతో సాయం చేసి తనలా బుక్‌ కాకండని సూచిస్తూ ఆ పోస్టును పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు