ఫరూక్‌ ఇంట్లో చొరబడ్డ ఆగంతకుడు

5 Aug, 2018 04:38 IST|Sakshi
ఫరూక్‌ ఇంటి ముందు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

కారుతో గేటు బద్దలుకొట్టి లోపల విధ్వంసం సృష్టించిన వైనం

చివరకు భద్రతా దళాల చేతిలో హతం

జమ్మూ: కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా నివాసంలోకి ఓ యువకుడు కారుతో దూసుకొచ్చి కలకలం సృష్టించాడు. గేటు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించిన అతను ఇంట్లోకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డాడు. చివరకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భదత్రా దళాలు అతడిని కాల్చి చంపాయి. శనివారం జమ్మూ శివారులోని భటిందీలో ఈ ఘటన జరిగింది. శ్రీనగర్‌ ఎంపీ అయిన ఫరూక్‌ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లి, తిరిగొస్తున్న సమయంలో ఆయన ఇంటిపై ఈ దాడి జరిగింది. ఫరూక్‌తో పాటు ఆయన కొడుకు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణ కలిగిన ప్రముఖుల ఇంట్లోకి అనామకుడు చొరబడటం తీవ్ర భద్రతా ఉల్లంఘనను తేటతెల్లం చేస్తోంది. కాగా, చొరబాటుదారుడిని పాతికేళ్ల సయీద్‌ మురాద్‌ షాగా గుర్తించారు.

హెచ్చరించినా దూసుకెళ్లాడు..
భద్రతా సిబ్బంది హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ వేగంగా దూసుకొచ్చిన మురాద్‌.. ఇంటి ముందటి గేటును బద్దలుకొట్టి లోనికి చొరబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాంపౌండ్‌ లోపల అడ్డందిడ్డంగా వాహనం నడుపుతూ లాన్‌లో కారు దిగాడు. మురాద్‌ను నిలువరించే క్రమంలో ఒక పోలీస్‌ గాయపడ్డాడు. లోనికి వెళ్లిన మురాద్‌  గాజు టేబుళ్లు, గోడలకు వేలాడుతున్న చిత్రపటాలను ధ్వంసం చేశాడు. తర్వాత బెడ్‌రూంకు వెళ్లే మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించగా సీఆర్‌పీఫ్‌ జవాన్లు అతడిని హతమార్చారు. కేసు నమోదుచేసి అతని తండ్రి జాడను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఫరూక్‌ నివాసానికి పటిష్ట భద్రత ఉన్నా మురాద్‌లోనికి ఎలా ప్రవేశించాడన్నదానిపై విచారణకు ఆదేశించారు. కాగా, ఈ పరిణామంపై ఫరూక్‌ అబ్దుల్లా స్పందిస్తూ..ఈ ఘటన దురదృష్టకరమని, రాష్ట్రంలో నెలకొన్న భద్రతా పరిస్థితిని ఇది తేటతెల్లం చేస్తోందని అన్నారు. ఉదయం జిమ్‌కు వెళ్లిన మురాద్‌.. ఫరూక్‌ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడో అర్థంకావడం లేదని అతని బంధువులు చెప్పారు. మురాద్‌ వెంట ఎలాంటి ఆయుధాలు లేవని, అతడిని అరెస్ట్‌ చేయకుండా ఎందుకు కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు