పిల్లలను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష!

26 Jul, 2016 18:51 IST|Sakshi
పిల్లలను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష!

హౌరాః నలుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి ఉరిశిక్ష పడింది. ఐదేళ్ళ క్రితం తన ముగ్గురు పిల్లలతోపాటు, తన మరదలి కొడుకును కూడా నిర్దాక్షణ్యంగా హత్య చేసినట్లు రుజువు కావడంతో ఉలుబెరియా అడిషనల్ సెషన్స్ జడ్జి సుభాషిష్ ఘోష్ దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు.

నలుగురు చిన్నారులను దారుణంగా హత్య చేసిన కేసులో 40 ఏళ్ళ ఖురేషీ కి  పశ్చిమబెంగాల్ హౌరా జిల్లాలోని కోర్ట్ ఉరి శిక్ష విధించింది. ఐదేళ్ళ క్రితం రైష్ ఖురేషీ తన ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకుతో సహా, తన మరదలి కుమారుడ్ని కూడా నదిలోకి విసిరేసి హత్య చేశాడు. పిల్లలు తనకు పుట్టినవారు కాదన్న అనుమానంతోనే వారిని హతమార్చినట్లు నిందితుడు విచారణలో కోర్టు ముందు అంగీకరించాడు. 2011 నవంబర్ 14న కుటుంబ సభ్యులంతా ఓ పెళ్ళి హడావుడిలో ఉండగా  ఖురేషీ  తన ముగ్గురు పిల్లల్నీ పిక్నిక్ కు  తీసికెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో తన మరదలి కొడుకు కూడా తమతో ఉండటంతో ఆ బాలుడ్ని కూడా తన బిడ్డలతో పాటు తీసుకెళ్ళాడు. దామోదర్ నదికి దగ్గరలోని మహిష్రేఖా ప్రాంతంలోకి వెళ్ళిన అనంతరం నలుగురు పిల్నల్నీ నదిలోకి విసిరేసి ఉత్తర ప్రదేశ్ కు పారిపోయాడు.

ఖురేషీ కూతుళ్ళు నాలుగేళ్ళ రౌనక్, రెండున్నరేళ్ళ అలిషా, ఆరేళ్ళ కొడుకు షహీద్ తో పాటు, అతడి మరదలి కొడుకు ఆరేళ్ళ హసన్ బాడీలు రెండోరోజు నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి. కొన్నాళ్ళ తర్వాత పిల్లలను నదిలో విసిరేసిన ప్రాంతానికి తిరిగి వచ్చిన ఖురేషీ తానుకూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అపస్మారక స్థితిలో కనిపించిన అతడిని ఆస్పత్రికి తరలించగా కుటుంబ సభ్యులు ఖురేషీగా గుర్తించారు. నిందితుడు ఖురేషీని నవంబర్ 21న పోలీసులు అరెస్ట్ చేశారు. 2012 లో కేసును స్వాధీనం చేసుకున్న సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు