కుక్క ఫోటోతో ఓటరు గుర్తింపు కార్డు జారీ

5 Mar, 2020 14:23 IST|Sakshi

ముర్షిదాబాద్‌ : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ వ్యక్తి ఓటర్‌ గుర్తింపు కారర్డులో వ్యక్తి ఫోటోకి బదులు కుక్క బొమ్మతో కార్డు జారీ చేయడం కలకలం రేపింది. ముర్షిదాబాద్‌కు చెందిన సునీల్‌ కర్మాకర్‌ పుట్టిన తేదీలో తప్పు దొర్లగా దాన్ని సరిదిద్దాలని జనవరి 8న దరఖాస్తు చేసుకున్నాడు. ఈసీ జారీ చేసిన గుర్తింపు కార్డులో తన ఫోటోకు బదులు కుక్కను ముద్రించడంపై సునీల్‌ కర్మాకర్‌ మండిపడుతున్నారు. మనిషినైన తన స్ధానంలో ఈసీ ఓ జంతువు ఫోటోను ప్రచురించడం తనను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఓటరు కార్డును బుధవారం తనకు అందించగా తన ఫోటో స్ధానంలో కుక్క బొమ్మ ఉండటాన్ని గుర్తించానని, ఈ విషయం సదరు అధికారి గుర్తించలేదని, ఇది తన గౌరవంతో చెలగాటమాడటమేనని కర్మాకర్‌ వాపోయారు. తాను బీడీఓ కార్యాలయానికి వెళ్లి మరోసారి ఇలా జరగకూడదని అధికారులను కోరానని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది పొరపాటుగా జరిగిందని ఫరక్కా బీడీఓ రాజర్షి చక్రవర్తి అంగీకరించారు. కర్మాకర్‌కు సరైన ఫోటోతో నూతన ఓటరు కార్డును త్వరలో జారీ చేస్తామని చెప్పారు.

చదవండి : బ్యాలెట్‌కు వెళ్లే ప్రసక్తే లేదు: సీఈసీ

మరిన్ని వార్తలు