నకిలీ వైస్‌చాన్స్‌లర్...

26 Jun, 2016 21:08 IST|Sakshi
నకిలీ వైస్‌చాన్స్‌లర్...

బెంగళూరు: నకిలీ యూనివర్శిటీని ప్రారంభించి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు విద్యాసంస్థల యాజమాన్యానికి కుచ్చుటోపి పెట్టిన ఘనుడిని బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విచారణలో ఎంబీయే చదివిన ఈ నిందితుడు ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిని తన కార్యాలయంలో ఉద్యోగిగా నియమించుకున్నట్లు తేలడం గమనార్హం.

యూనివర్శిటీనే సష్టించాడు
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంతోష్ లెహర్ 2004లో బెంగళూరుకు చేరుకుని ఇక్కడే ఎంబీఏ పూర్తి చేశాడు. అటుపై కొన్ని ప్రముఖ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఏడాది క్రితం ఉద్యోగానికి ఫుల్‌స్టాఫ్ పెట్టేశాడు. నగరంలోని బన్నేరుఘట్ట రోడ్డులో ‘బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఇందుకు తనకు తాను వైస్ చాన్స్‌లర్‌గా ప్రకటించుకున్నాడు. అనంతరం ఇంటర్‌నెట్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలను సంప్రదించి ‘ దేశంలో ఎవరైనా ఇక పై నర్సింగ్, పారామెడికల్ కోర్సులకు సంబంధించి విద్యా సంస్థలను ప్రారంభించాలన్నా, లేక ఇప్పటికే ఉన్న కళాశాలల్లో సదరు కోర్సులను మొదలు పెట్టాలన్నా తమ యూనివర్శిటీ అనుమతి తప్పని సరి.’ అని పేర్కొనడంతో పాటు ఇందుకు సంబంధించిన నకిలీ ధృవీకరణ పత్రాలను కూడా వారికి అందజేసేవాడు.

ఈ పత్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ పత్రాలను పోలి ఉండటం గమనార్హం. ఇందుకు ఏదేని విద్యాసంస్థ యాజమాన్యం ప్రతిస్పందించిందంటే సంతోష్ లెహర్ ఇక తన చాతుర్యాన్ని ప్రదర్శించేవాడు. ప్రతిస్పందించిన వారి వద్దకు ఎర్రబుగ్గ ఉన్న కారులో వెళ్లేవాడు. వారు ఇప్పటికే విద్యాసంస్థలను నిర్వహిస్తుంటే వివిధ రకాల పేర్లతో పరిశీలనలు జరిపి డబ్బు గుంజేవాడు. ఈ విధంగా ఇప్పటి వరకు కేరళ, తమిళనాడురాష్ట్రాలతోపాటూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, చుట్టుపక్కల ఉన్న పలు విద్యాసంస్థల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేశాడు.

వంచన ఇలా బయటపడింది...
ఈ ఏడాది ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌లో బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్ నకిలీదంటూ పశ్చిమ బెంగాల్‌లో ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో గతంలో ఈ వర్శిటీ నుంచి వివిధ రకాల కోర్సులకు అనుమతి పొందిన చెన్నై కు చెందిన వీరిస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షుడు టీసీ.అరివళగన్, సంతోష్ లెహర్‌ను ప్రశ్నించారు. అయితే అవన్నీ గిట్టనివారు చేస్తున్నారని పట్టించుకోనవసరం లేదని సంతోష్ లెహర్ చెప్పి అప్పటికప్పుడు మభ్యపెట్టారు. అటు పై మే 4న వంచన కేసులో ‘బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్ సీఈఓ శ్యామల్ దత్త అరెస్టైన విషయం అక్కడి వార్తా పత్రికలతో పాటు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి.

అంతేకాకుండా సదరు సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉన్నట్లు కూడా తెలిపాయి. విషయం తెలుసుకున్న టీ.పీ అరివళగన్ నగరంలోని పోలీసులను సంప్రదించారు. అప్పటికే ఈ విద్యాసంస్థ విషయమై సమాచారం అందుకున్న నగర పోలీసులు బన్నేరుగట్టలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆ సంస్థ శాఖల పై ఏ కాలంలో దాడుల చేశారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నిందితుడైన సంతోష్‌లెహర్ పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ కమిషనర్ శరప్ప ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివిధ చోట్ల గాలింపు చేపట్టారు. చివరికి బంధువుల ఇంట్లో ఉన్న సంతోష్‌లెహర్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తులో ఇతను వివిధ సంస్థల నుంచి ఇప్పటి వరకూ రూ.78.40 లక్షలను పరిశీలన రుసుం పేరుతో వసూలు చేసినట్లు తేలింది.

ఇదిలా ఉండగా ఇతని కార్యాలయం, ఇంటిలో పెద్ద సంఖ్యలో కోర్సుల ప్రారంభానికి సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలు, స్టాంప్ పేపర్లు, రబ్బరు స్టాంపులతో పాటు రూ.8.96 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇతని పేరు పై ఉన్న బ్యాంకు ఖాతాలోని రూ.27లక్షల నగదుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపకూడదని సంబంధింత అధికారులకు బ్యాంకు అధికారులకు పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా ఇతని వద్ద ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పనిచేస్తుండేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సంతోష్ లెహర్ మోసంలో సదరు విశ్రాంత ఐఏఎస్ అధికారి పాత్ర తేల్చడానికి పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు