‘దయచేసి.. వాళ్లను ప్రశాంతంగా బతకనిద్దాం’

29 Nov, 2018 12:06 IST|Sakshi

అండమాన్‌ నికోబార్‌ గిరిజన పరిశోధన సంస్థ డైరెక్టర్‌ ఎస్‌ఏ అవరాది

అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా విహరిస్తూ.. తమదైన ప్రపంచంలో గడుపుతారు.. దుస్తుల స్థానంలో ఆకులు చుట్టుకుంటారు... పడవలు తయారు చేసుకుంటారు... చేపలు పడతారు... తమ ఉనికికి ప్రమాదమని తెలిస్తే ఎవరినైనా చంపేందుకైనా వెనకాడరు.. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో నివసించే సెంటినెలీస్‌ తెగ ప్రజల గురించి అధ్యయనం చేసిన పరిశోధకులు చెప్పిన వివరాలు. జాన్‌ అలెన్‌ చౌ అనే అమెరికన్‌ టూరిస్ట్‌ ఇటీవల సెంటినల్‌ దీవిలో దారుణ హత్యకు గురి కావడంతో సెంటినలీస్‌ల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

నేటి వరకు అంతరించిపోని అరుదైన తెగగా గుర్తింపు పొందిన సెంటినలీస్‌లు అలెన్‌ కంటే ముందు అంటే 2006లో తమ ప్రాంతంలో అడుగుపెట్టిన ఇద్దరు జాలర్లను దారుణంగా హతమార్చి పూడ్చిపెట్టారు. అయితే అంతకుముందు మాత్రం ఈ తెగ ప్రజలు ఎవరినీ చంపిన దాఖలాలు లేవు. కానీ బయటి ప్రపంచానికి చెందిన వ్యక్తులు తరచుగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో తమ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని భావించినందు వల్లే సెంటినలీస్‌లు క్రూరంగా ప్రవర్తిసున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారిగా సెంటినలీస్‌లను రెండుసార్లు దగ్గరగా చూసి ప్రాణాలతో బయటపడ్డ... అండమాన్‌ నికోబార్‌ గిరిజన పరిశోధన సంస్థ డైరెక్టర్‌ ఎస్‌ఏ అవరాది 1991లో తనకు ఎదురైన అనుభవాల గురించి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు.

‘ఇలాంటి అనుభవాలను పంచుకోవడం అంతగా ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఆరోజు జనవరి 3, 1991. 13 మంది బృందంతో కలిసి సెంటినల్‌ దీవికి బయల్దేరా. మాలో చాలా మందిని ఒక రకమైన భయం ఆవహించింది. తిరిగి ప్రాణాలతో వస్తామనే నమ్మకం లేదు. కానీ ఎలాగైనా సెంటినలీస్‌ తెగ గురించి తెలుసుకోవాలనే పట్టుదల. అందులోనూ అధికారులుగా అది మా బాధ్యత. రాజధాని పోర్టు బ్లేయర్‌ నుంచి సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాం. మరుసటి రోజుకు ఉత్తర సెంటినల్‌ దీవికి చేరుకున్నాం. గమ్యం సమీపిస్తున్న కొద్దీ భయం, ఉత్సుకత అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బహుశా ఒకేసారి ఇలా రెండు భావాలు కలగడం మాలో చాలా మందికి అదే మొదటిసారి. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో మదర్‌ షిప్‌ నుంచి ఓ చిన్న పడవలోకి నేను మారాను. మిగతా వాళ్లు మాత్రం అందులోనే ఉన్నారు. మెల్లగా ఉత్తర సెంటినల్‌ దీవిలో అడుపెట్టా. అప్పుడే అడవి నుంచి సెంటినలీస్‌లు బయటికి వస్తున్నారు. అంతా కలిపి 27 మంది ఉన్నారు. వారిని చూడగానే నా పైప్రాణాలు పైనే పోయాయి.

పర్యటనకు బయల్దేరే ముందు వారి గురించి రాసిన పుస్తకాలను చదివిన అనుభవం నాకు ఉంది. ఎవరినైనా బయటి వ్యక్తిని చూస్తేనే చాలు మరో మాట లేకుండా వెంటనే బాణాలతో వేటాడేస్తారని తెలుసు. కానీ వారి నుంచి నాకు వింత అనుభవం ఎదురైంది. వారి చేతిలో బాణాలు ఉన్నాయి. అయినా నాకు హాని చేయలేదు. దీంతో నాకు కొంచెం దైర్యం వచ్చింది. వెంటనే నా దగ్గర ఉన్న కొబ్బరి బోండాలను అందులో ఓ వ్యక్తికి ఇచ్చాను. అతడు నవ్వుతూ వాటిని తీసుకున్నాడు. మిగతావారు కూడా అతడిని అనుసరించారు. ఈ చర్యతో వారు మమ్మల్ని స్వాగతించినట్టుగా భావించాము’ అని అవరాది చెప్పుకొచ్చారు. అందరూ అనుకుంటున్నట్లుగా వాళ్లు మరీ అంత క్రూరులు కాదు అని నమ్మేందుకు ఇటువంటి సంఘటనలు అనేకం అవరాది ఉన్నాయని పేర్కొన్నారు. (అతడి శవం దొరికే అవకాశమే లేదా?!)

అలెన్‌ మృతదేహాన్ని వెలికితీసే విషయమై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించగా.. ‘ఒక్క విషయం మాత్రమే చెప్పగలను. సెంటినలీస్‌ తెగ ప్రజలు వాళ్ల బతుకు వాళ్లు బతకాలనుకుంటున్నారు. దయచేసి వారిని ప్రశాంతంగా బతకనిస్తే మంచిదని’ బదులిచ్చారు. కాగా బ్రిటిష్‌ మిలటరీ 1880లో సెంటినలీస్‌పై దాడి చేసి వృద్ధ దంపతులు, నలుగురు సంతానాన్ని పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకొచ్చింది. కొన్ని రోజులకే దంపతులు చనిపోవడంతో ఆ సంతానాన్ని మళ్లీ అడవుల్లో వదిలేశారు.

1967లో టి.ఎన్‌.పండిట్‌ అనే పురాతత్వ శాస్త్రవేత్త సెంటినలీస్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. వాళ్లు అడవుల్లోకి పారిపోయారు. ఆ తరువాత భారత నౌకాదళం ఈ దీవి సమీపంలో కొన్ని బహుమతులు విడిచిపెట్టి.. ఎవరైనా వాటిని తీసుకెళతారా అని వేచిచూసింది. కానీ వారు బాణాలు ఎక్కుపెట్టి అందరినీ తరిమేశారు. మళ్లీ 1974లో నేషనల్‌ జియోగ్రఫిక్‌ చానల్‌ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీద్దామని నార్త్‌ సెంటినలీస్‌ ద్వీపానికి వెళ్లారు. అల్యూమినియం పాత్రలు, కొబ్బరిబోండాలు, ఓ పందిని బహుమతులుగా తీసుకుని వెళ్లారు. తీరంలో అడుగుపెట్టారో లేదో.. వారిపై బాణాల వర్షం కురవడం మొదలైంది. బహుమతులన్నీ అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. సెంటినలీస్‌లు కొబ్బరిబోండాలు, కొన్ని పాత్రలు తీసుకెళ్లారుగానీ, ఆ పందిని మాత్రం అక్కడికక్కడే చంపి పాతిపెట్టేశారు.

ఇక.. 1991లో టి.ఎన్‌.పండిట్‌ మరోసారి గిరిజన సంక్షేమ శాఖ అధికారి అవరాదితో కలిసి వారిని సంప్రదించే ప్రయత్నం చేసి పాక్షిక విజయం సాధించారు. కొంతమంది పండిట్‌ పడవలోకి ఎక్కడమే కాకుండా అక్కడున్న వస్తువులను ఆసక్తిగా తడిమి చూశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సెంటినలీస్‌లు అంటువ్యాధుల బారిన పడటంతో భారత ప్రభుత్వం వారి గురించి ఆరా తీయడానికి స్వస్తి పలికింది. అయితే అలెన్‌ క్రైస్తవ మత ప్రచారం కోసం వెళ్లి సెంటినలీస్‌ల చేతిలో హత్యకు గురికావడంతో వీళ్లకు సంబంధించి మరోసారి చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు