27 ఏళ్ల తర్వాత ఇంటికి: ‘తప్పు చేశా’..

22 May, 2020 18:37 IST|Sakshi
మెహంగీ ప్రసాద్

లక్నో : తండ్రితో ఏర్పడ్డ మనస్పర్థల వల్ల ఇళ్లు వదలి పెట్టి వెళ్లిపోయిన ఓ వ్యక్తి కరోనా వైరస్‌ లాక్‌డౌన్ కారణంగా‌ 27 ఏళ్ల తర్వాత కుటుంబం వద్దకు చేరుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మెహంగీ ప్రసాద్‌ తండ్రితో మనస్పర్థల కారణంగా 1993లో తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని వదలి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అప్పుడు అతడి వయసు 36 ఏళ్లు. ప్రసాద్‌ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎంత గాలించినా దొరకలేదు. ముంబై చేరుకున్న ప్రసాద్‌ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ బ్రతికేవాడు. కానీ, కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేకపోవటంతో అతడి మనసు ఇంటివైపు మళ్లింది. వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. మే 6న 1100 కిలోమీటర్లు ప్రయాణించి ఊరికి చేరుకున్నాడు. ( ముఖానికి నల్లరంగు: మెడలో చెప్పుల దండ..)

అయితే కుటుంబసభ్యుల ఆచూకీ కనుక్కోవటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో గ్రామంలో క్వారెంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. చివరకు క్వారెంటైన్‌ తర్వాత కుటుంబసభ్యుల్ని కలుసుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత 63 ఏళ్ల తండ్రిని చూసేసరికి అతడి కూతురు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అయితే తల్లిదండ్రులు, భార్య మరణించారని తెలుసుకుని అతడు చాలా బాధపడ్డాడు. కోపంలో ఇంటినుంచి వెళ్లిపోయి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపపడ్డాడు.

మరిన్ని వార్తలు